Air India: మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్!

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన (Air India Flight Crash) దుర్ఘటనపై టాటా గ్రూప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (N Chandrasekharan) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని, ఇది తమను తీవ్రంగా కలచివేస్తోందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అలాగే గాయపడిన వారి చికిత్సకు కావాల్సిన అన్ని ఖర్చులను టాటా గ్రూప్ భరిస్తుందని తెలిపారు. ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజీ భవనానికి ప్రత్యామ్నాయంగా కొత్త కట్టడం నిర్మించేందుకు తమవంతుగా సహాయపడతామని ఆయన (N Chandrasekharan) హామీ ఇచ్చారు. గురువారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ తర్వాత కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో తమ బాధను పంచుకొని, బాధితులకు సానుభూతి తెలియజేశారు.