Supreme Court: గవర్నర్లకు విచక్షణాధికారాల్లేవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్(RN ravikumar) తొక్కిపట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
‘‘గవర్నర్ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి పెట్టడం న్యాయ సమ్మతం కాని ఏకపక్ష చర్య. అందుకే ఆ చర్యను తోసిపుచ్చుతున్నాం’’ అని జస్టిస్ జె.బి.పర్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం.
‘బిల్లులపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రంలో శాసన నిర్మాణ వ్యవస్థకు గవర్నర్ అవరోధం కలిగించవచ్చన్న అర్థం వచ్చేలా రాజ్యాంగంలోని 200వ అధికరణాన్ని చదువుకోకూడదు’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది.
మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించారు. తమ న్యాయపోరాటం దేశానికి వెలుగు చూపిందని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.