Supreme court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. భవిష్యత్తు సమస్యలపై హెచ్చరిక

ఎన్నికల్లో గెలవడానికి నేతలు ఎంచుకున్న బ్రహ్మాస్త్రం ఉచితాలు. ఒక రకంగా చెప్పాలంటే తాము చేసిన మంచికంటే ఇవ్వబోయే ఉచితల గురించే ఎన్నికల సమయంలో నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రజలు కూడా తమకు ఉచితంగా ఏదో ఒకటి వస్తుంది కదా అన్న ఆశతో ఎవరు ఎక్కువ ఉచితాలు అందిస్తే వారికి ఓటు వేసే స్థితి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఉచిత హామీలు (Free Schemes) ప్రజలకు లాభసాటిగా కనిపించినా, దీని ప్రభావం సమాజంపై దుష్పరిణామాలను మిగిల్చుతోందని సుప్రీంకోర్టు (Supreme court) ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన విచారణలో, ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వాగ్దానాల పేరుతో ఇచ్చే ఉచిత పథకాలు ప్రజల్లో బద్ధకాన్ని పెంచుతున్నాయని, సమాజంలో కష్టపడే వారు తగ్గిపోతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాల వల్ల పని చేయాల్సిన యువత కూడా కష్టపడకుండా సులభమైన మార్గాలను ఆశ్రయిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఆదాయ వనరులు (Income sources) లేకపోతే మాత్రమే ప్రభుత్వ సహాయం అవసరమని, కానీ అర్హత ఉన్నవారు కూడా ఉచిత పథకాలను ఆశ్రయించడం సమాజానికి మంచిది కాదని పేర్కొంది. ప్రజలు స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఉందని, లేదంటే సమాజంలో ఉత్పాదక శక్తి తగ్గిపోతుందని హెచ్చరించింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను ‘బెగ్గర్ ఫ్రీ’ సిటీగా మార్చారు. దీనివల్ల వందల మంది నిరాశ్రయులు, యాచకులు రహితంగా మారిపోయారని, వారిని ఆదుకునేందుకు సరైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పట్టణ ప్రాంతాల్లో యాచకుల కోసం ప్రభుత్వాలు అధికారిక ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, ప్రభుత్వాలు ఉచిత పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నాయని సంబంధిత న్యాయవాదులు చెప్పినప్పటికీ, దీని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, పని చేయగలిగినవారు కూడా కేవలం ఉచితాల కోసం నిరుద్యోగులుగా మారుతున్నారని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో గెలవాలంటే ఉచిత హామీలే మార్గమా? ప్రభుత్వాలు ఏర్పడాలంటే ప్రజలకు ఉచితాలు పంచాల్సిందేనా? అనే ప్రశ్నలను కోర్టు ప్రస్తావించింది. ఉచితాల వల్ల శ్రమశక్తి తగ్గిపోతున్నదని, దీని ప్రభావం భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారొచ్చని సూచించింది. ప్రజలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని, లేకపోతే సమాజం పతనమవుతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తాజా విచారణను వాయిదా వేసింది.
దీంతో ప్రస్తుతం పలు రాజకీయ పార్టీలు అందిస్తున్న ఉచిత పథకాలపై అన్ని రాష్ట్రాలలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కేవలం తమ రాజకీయాల లబ్ధి కోసం నాయకులు ప్రజలను బద్ధకస్తులుగా చేస్తున్నారు అని వాదించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇకనైనా కేవలం ఉచిత పథకాల మీద ఆధారపడకుండా..చేసే మేలునిబట్టి.. చూపే అభివృద్ధిని బట్టి ప్రభుత్వాన్ని ఎంచుకొనే దిశగా ప్రజలు ఉంటే బాగుంటుంది అని అందరూ భావిస్తున్నారు.