ప్రపంచంలోనే భారత్ టాప్ … ప్రతి లక్ష మందిలో 12కు పైగా

ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్యలు జరిగిన దేశంగా భారత్ నిలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఆత్మహత్యల రేటు ప్రతి లక్షకు 12.4 మందికి పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్న అంశాలేమిటి అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. అయితే మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో జన్యుపరమైన కారణాలు, కొన్నిరకాల ఒత్తిళ్ల వల్ల ప్రేరేపితమవుతున్న మానసిక అనారోగ్యంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఆత్మహత్యకు అత్యంత సాధారణ కారణం డిప్రెషన్. దీన్నే మేం ఒత్తిడి అని పిలుస్తాం. వెంటాడుతున్న సమస్యల వల్ల ఒత్తిడికి గురికావొచ్చు. ఒక్కోసారి హఠాత్తుగా కక్షికావేశం లోనూ ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎక్కువ శాతం కేసుల్లో ఒత్తిడే ప్రధాన కారణంగా ఉంటుందని అని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రాజీవ్ మెహతా తెలిపారు.