Stalin: తమిళనాడులో మళ్లీ భాషా మంటలు..

జాతీయ విద్యావిధానం(NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్రమైంది. ఎన్‌ఈపీ పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని తమిళనాడు సీఎం ఆరోపించారు. ఈ విషయంపై సాక్షాత్తూ ప్రధానిమోడీకి లేఖ రాశారు స్టాలిన్(Stalin). రాష్ట్రానికి రావాల్సిన రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని పునరుద్ఘాటించారు. 1965లో ఎగసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ…‘తేనెతుట్టెపై రాళ్లు వేయరాదని’ హెచ్చరించారు. తమిళనాడులో ద్విభాషా సూత్రాన్నే (తమిళం, ఆంగ్లం) అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి(udhaya nidhi) కూడా తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని విపక్ష ఏఐఏడీఎంకే(AIADMK) కూడా త్రిభాషా సూత్రం అమలును వ్యతిరేకిస్తోంది.
మోడీకి రాసిన లేఖపై స్పందించారు కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్(dharmendra pradhan). భాషలను రాజకీయ కోణంలో చూడవద్దంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి కోరారు. రాజకీయ అభిప్రాయ భేదాలకు అతీతంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఓ లేఖలో సూచించారు. జాతీయ విద్యావిధానం-2020 భాషా స్వేచ్ఛను కలిగి ఉందని, విద్యార్థులు ఇష్టపడే భాష చదివే అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ప్రధాని మోడీకి గురువారం తమిళనాడు సీఎం లేఖ రాసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ మేరకు స్పందించారు. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే స్పందిస్తూ…‘తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదని’ స్పష్టం చేశారు
తేనెతుట్టెపై రాళ్లు వేయవద్దంటూ స్టాలిన్ ఘాటుగా ప్రతిస్పందించిన నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ చేశారు. దేశ భాషల మధ్య ఎన్నడూ వైరం లేదని, అవన్నీ పరస్పరం చేయూతనందించుకుంటూ సుపంపన్నమయ్యాయని తెలిపారు.
భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడు భారతీయ భాషా వారసత్వం దీటుగా వాటికి సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. భాషాపరమైన దురభిమానాలకు దూరంగా ఉండటం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. దిల్లీలో శుక్రవారం నిర్వహించిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు..బీజేపీ తమిళనాడు శాఖ ‘గెటవుట్ స్టాలిన్’ అంటూ సీఎంకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది.