కమలా హారిస్ గెలుపుకై తమిళనాడులోని.. పూర్వీకుల గ్రామంలో పూజలు

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్ 5న ప్రధాన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో అమెరికాకు దాదాపు 14 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తులసేంద్రపురం అనే మారుమూల గ్రామంలో యూఎస్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ గ్రామం తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో ఉంది. ఇది హారిస్ పూర్వీకుల గ్రాం. అందుకే ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతు తెలుపుతూ గ్రామస్థులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. గ్రామ వీధులు, ప్రధాన కూడళ్ల వద్ద భారీగా కమలా హారిస్‌కు మద్దతుగా పోస్టర్లు పెట్టారు. అంతేకాదు స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజా కార్యక్రమాలకు కూడా శ్రీకారుం చుట్టారు. అమెరికా ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ గ్రామం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.