Gandhi family: బలమైన ఓటుబ్యాంకునే పోగొట్టుకుంటుందా..? కాంగ్రెస్ పయనం ఎటు..?

కాంగ్రెస్ నాయకులు తెలిసి చేస్తున్నారా..? తెలియక చేస్తున్నారా…? ఏదో యధాప్రకారం జరిగిపోతోందా.. అర్థం కాదు కానీ… వారు రాజకీయంగా నష్టపోతున్నారని మాత్రం అందరికీ అర్థమవుతోంది. పొరపాటున నోరు జారడం.. అది చిరిగి చేటంత కావడం కామనైపోయింది. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ దేశ రాష్ట్రపతిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(murmu) ఇదివరకు ఇచ్చిన ప్రసంగాన్ని ఉద్దేశించి సోనియా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని పూర్ లేడీ అంటూ వివాదానికి తెర లేపారు. అధ్యక్షురాలు తన ప్రసంగం పాఠాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారని, అలసిపోయారని అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాష్ట్రపతి కార్యాలయం దీన్ని ఖండించింది. రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవానికి భంగం కలిగించేలా సోనియాగాంధీ చేసిన ఈ వ్యాఖ్యల చేశారని పేర్కొంది. అట్టడుగు వర్గాలు, రైతుల ప్రతినిధి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన అభ్యంతరాలు, ఆందోళనలను వ్యక్త పరిచారని తెలిపింది. పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న నిబద్ధత ఎప్పటికీ అలసిపోదు.. అని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
ఈ వ్యాఖ్యల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఘాటు విమర్శలు చేశారు. మొట్ట మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిని, ఓ సాధారణ మహిళలను ప్రత్యక్షంగా అవమానించడమేనంటూ మండిపడ్డారు. రాచరిక కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని బహిరంగంగా అగౌరవపరిచిందని వ్యాఖ్యానించారు.గిరిజన వర్గాల పట్ల పార్టీకి ఉన్న తన వ్యతిరేక భావజాలాన్ని సోనియా గాంధీ బయటపెట్టారని మోడీ ధ్వజమెత్తారు.
గత ఏడాది జులైలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా ద్రౌపది ముర్ముపై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. ఆమెను రాష్ట్రపత్నిగా సంబోధించారు. రాష్ట్రపతి హోదాను అవమానించారు. ఆయన వ్యాఖ్యలు.. పార్టీ భూస్వామ్య, జాత్యహంకార దృక్పథాన్ని బహిర్గతం చేశాయంటూ అప్పట్లో విమర్శలు తలెత్తాయి. రాష్ట్రపతి ఇతర ఆధిపత్య కుటుంబం నుంచి వచ్చినట్లయితే కాంగ్రెస్ ఇలాంటి అగౌరవ వ్యాఖ్యలు చేసి ఉండేదా? అనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఓ గిరిజన మహిళ.. దేశంలో అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని అధిష్ఠించడాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ అంగీకరించదంటూ బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమైందని చెప్పొచ్చు.