ఇది ఏమాత్రం మంచి పద్దతి కాదు… వారికి మాత్రమే ప్రాధాన్యం
బ్యాంకుల్లో కస్టమర్లతో సంభాషించే విభాగంలో పనిచేసే సిబ్బంది స్థానిక భాషల్లో మాట్లాడేవిధంగా చూసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు. ఆ మేరకు బ్యాంకులు తమ సిబ్బందిని సమీక్షించుకోవాలన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏజీఎంలో మాట్లాడుతూ ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్థానిక భాషలను మాట్లాడగలిగే వారిని మాత్రమే ఆ విభాగంలో పెట్టి, మిగిలిన వారిని వేరే సేవలకు వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో వివిధ భాషలు మాట్లాడే వ్యక్తలు ఉన్నారని, కాబట్టి బ్యాంకులు తమ సిబ్బందిని రిక్రూట్ చేసేటప్పుడు స్థానిక భాషలు మాట్లాడేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
కస్టమర్లతో మాట్లాడే విధానాన్ని కూడా వారికి నేర్పాలన్నారు. ఫలానా భాషే మాట్లాడాలని వినియోగదారులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు. హిందీ మాట్లాడకపోతే వారు భారతీయులే కాదన్న విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని చెప్పారు. వాస్తవంగా జరిగినదాన్నే తానిక్కడ ప్రస్తావిస్తున్నానని అన్నారు. ఇది ఏమాత్రం మంచి పద్దతి కాదన్నారు. కాబట్టి స్థానిక భాషలు మాట్లాడేవారికి ఆయా విభాగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.






