దొంగ ఓట్లు వేస్తూ వీడియో తీసి వైరల్ చేసిన ఓటర్..

ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్స్ తీసుకువెళ్లడానికి వీలులేదు. ఒకవేళ పొరపాటున తీసుకువెళ్లినా ఓటింగ్ ప్రక్రియను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ధైర్యం ఎవ్వరు చేయరు. అలాంటిది ఒక యువకుడు దొంగ ఓట్లు వేయడమే కాకుండా ఆ ప్రక్రియను ధైర్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అతను వేసిన దొంగ ఓట్లు బీజేపీ పార్టీకి కావడం మరొక విశేషం. అతనొక్కడే కాదు ఇలాంటి వీడియోలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పోలింగ్ సమయంలో ఇలా వీడియోలు తీసుకుంటే ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందా అంటూ నేటిజల్లు మండిపడుతున్నారు. మరోపక్క ప్రతిపక్షాలు కూడా ఈ వీడియోని హైలెట్ చేయడంతో పాటు దీనికి ఎన్నికల కమిషన్ ని ట్యాగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈవీఎం మిషన్లను మేనేజ్ చేస్తోంది అంటూ బీజేపీ పై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ దొంగ ఓట్ల వీడియో ఈ విషయంపై మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ముఖేష్ రాజ్‌పుత్ కు ఓ యువకుడు 8 సార్లు ఓటు వేస్తూ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తో ఈ రచ్చ మొదలైంది. ఈ పని చేసింది బీజేపీ నేత అనిల్ సింగ్ కొడుకు రజన్ సింగ్ ఠాకూర్ అని గుర్తించారు. అయితే అతని తండ్రి మాత్రం ఈ వీడియో ఈవీఎం మిషన్లను పరిశీలించే క్రమంలో తీసినదని.. తన కొడుకు దొంగఓట్లు వేయలేదని.. వీడియోను ఎడిట్ చేసి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.