Siddha Ramaiah: కర్ణాటకలో కుర్చీలాట లేదు… సీఎంగా తానే ఉంటానన్న సిద్ధరామయ్య…

కర్ణాటక (Karnataka) లో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తేల్చి చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం తనను కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయమని కోరినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.
‘‘సీఎంగా నేను ఐదేళ్లూ ఉంటాను. ఈ విషయాన్ని నేను ఎప్పుడో స్పష్టంగా చెప్పాను. జులై 2వ తేదీన కూడా దీనిపై ప్రకటన విడుదల చేశాను. ఆ సమయంలో డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా పోటీదారే. అందులో తప్పు ఏముంది. ‘కుర్చీ ఇప్పుడు ఖాళీగా లేదు’ అని ఆయనే అన్నారు’’ అని పేర్కొన్నారు.
నాయకత్వం రొటేషన్‌పై పార్టీ హైకమాండ్ టైమ్‌లైన్ లేదా సూచనలు ఏమీ చేయలేదని సిద్ధరామయ్య వెల్లడించారు. రెండున్నర సంవత్సరాల అంశాన్ని ఎవరూ నిర్ణయించలేదన్నారు. హైకమాండ్ నిర్ణయం తీసుకొంటే తమకు చెబుతుందని.. వాటిని తాము అమలుచేస్తామన్నారు. ఇక పార్టీ నాయకత్వంపై కాంగ్రెస్ రణ్‌దీప్ సుర్జేవాలా ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తలేదన్నారు. డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంగీకరించారు.
మరోవైపు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించిన అనంతరం తాను చేసేది ఏమీలేదని ఆ పీఠంపై కన్నేసిన డీకే శివకుమార్ నిర్వేదంతో వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ప్రయత్నాలు విఫలమైనా, ప్రార్థనలు విఫలం కాలేదని ఆయన పేర్కొన్నారు. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం విషయంలో మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటినుంచి ప్రచారం జరుగుతోంది.