America: అమెరికాకు మరోసారి ఆర్థిక మాంద్యం తప్పదా?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు ముంచుకొస్తోందా? అగ్రరాజ్యం అమెరికా (America) మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోనుందా? అవుననే అంటున్నారు పలువురు విశ్లేషకులు. ప్రస్తుత స్థూల ఆర్థిక గణాంకాలను బట్టి చూస్తే అమెరికా మాంద్యం అంచుల్లో ఉందని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ(Mark Jandy) హెచ్చరించారు. యూఎస్ జీడీపీ (GDP) లో మూడో వంతు (33.33 శాతం) ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుంది లేదా జారుకునేందుకు అధిక అవకాశాలున్నా యని ఆయన పేర్కొన్నారు. మరో మూడో వంతు నిలకడగా సాగుతుండగా, మిగతా మూడో వంతు మాత్రమే పురోగమిస్తోందన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే, వ్యోమింగ్, మోంటానా, మిన్నెసోటా, మిస్సిస్సిప్పీ, కాన్సాస్, మసాచుసెట్స్‌కు మాంద్యం ముప్పు పొంచి ఉందన్నారు. ట్రంప్ (Trump) అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోతపెట్టడంతో వాషింగ్టన్ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటోందన్నారు. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనావేసిన ఆర్థికవేత్తల్లో జాండీ ఒకరు. ఆ సంక్షోభం అమెరికాతో పాటు మొత్తం ప్రపంచాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే.