Shashi Tharoor: ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం.. దాన్నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిది: థరూర్

భారత చరిత్రలో ఎమర్జెన్సీ (Emergency) కాలాన్ని కేవలం ఒక చీకటి అధ్యాయంగా మాత్రమే చూడకుండా, దాని నుంచి విలువైన పాఠాలను నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక మలయాళ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరుపై థరూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బలవంతపు కుటుంబ నియంత్రణా ఆపరేషన్లను సంజయ్ గాంధీ (Sanjay Gandhi) అమలు చేసిన విధానాన్ని ఎవరూ మర్చిపోలేరని ఆయన అన్నారు. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు సుమారు రెండేళ్ల పాటు దేశంలో ఎమర్జెన్సీ (Emergency) అమలైంది. ఆ సమయంలో క్రమశిక్షణ పేరుతో తీసుకున్న చర్యలు “సమర్థించలేని క్రూరమైన చర్యలు” అని థరూర్ అభిప్రాయపడ్డారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ పేద గ్రామీణ ప్రాంతాల్లో వ్యాసెక్టమీ క్యాంపెయిన్‌లు నిర్వహించి, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారని ఆయన (Shashi Tharoor) గుర్తుచేశారు.
ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల “హింస నిరంకుశత్వంగా మారింది” అని థరూర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీ వంటి నగరాల్లో మురికివాడలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వేలాది మందిని నిరాశ్రయులను చేశారని, వారి సంక్షేమాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన (Shashi Tharoor) ఆరోపించారు. ఆనాటి పరిస్థితులు దురదృష్టకరమని భావించినప్పటికీ, ఎమర్జెన్సీ (Emergency) సమయంలో జరిగిన ఆ దారుణాలను ఎవరూ మర్చిపోలేరని శశి థరూర్ తన వ్యాసంలో స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని తేలికగా తీసుకోవద్దని, ఇది నిరంతరం పెంపొందించుకోవాల్సిన, సంరక్షించాల్సిన విలువైన వారసత్వమని థరూర్ (Shashi Tharoor) ఉద్ఘాటించారు. ఎమర్జెన్సీ కాలం నాటి భారత్ ప్రస్తుత పరిస్థితులకు భిన్నంగా ఉందని, ప్రస్తుతం మన దేశం స్వావలంబనతో ముందుకు సాగుతోందని, పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తోందని ఆయన అన్నారు. అయితే ఎమర్జెన్సీ (Emergency) సమయంలో ప్రాథమిక హక్కులను లెక్కచేయకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేశారని, అవన్నీ దేశ రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలిపోయాయని థరూర్ అన్నారు. అప్పటి ఎమర్జెన్సీ పరిస్థితులను కేవలం చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తుంచుకోకుండా, వాటి నుంచి పాఠాలను నేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఆయన (Shashi Tharoor) పిలుపునిచ్చారు.