Lalit Modi : సుప్రీంకోర్టులో లలిత్ మోదీకి ఎదురుదెబ్బ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi ) కి సుప్రీంకోర్టు (Supreme Court) లో ఎదురుదెబ్బ తగిలింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఈడీ తనకు విధించిన జరిమానాను బీసీసీఐ (BCCI) చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని లలిత్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘించారంటూ ఈడీ ఆయనకు రూ.10.65కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే, గత సంవత్సరం డిసెంబర్ 19న బాంబే హైకోర్టు (Bombay High Court) లలిత్ మోదీకి రూ.లక్ష జరిమానా విధించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం ఉల్లంఘించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను చెల్లించాలని బీసీసీఐని ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. లలిత్ మోదీ తన పిటిషన్‌లో తాను బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యానని, ఆ సమయంలో ఐపీఎల్ పాలక మండలి చైర్మన్‌గా ఉన్నానని గుర్తు చేశారు.