RCB: పరాజయాలే పాఠాలు.. ఐపీఎల్ విజేతగా ఆవిర్భవించిన ఆర్సీబీ ..!

ఐపీఎల్ (IPL) పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఎందుకంటే ఇవి.. మిగిలిన జట్లకు అందనంత ఎత్తున విజయాలు సాధించాయి. ఈ రెండు జట్లు చెరో ఐదుసార్లు కప్పులు సాధించాయి. అయితే కప్పులు గెలవకున్నా.. ఆకర్షణలో, ఆదరణలో ఆరెండింటికీ ఏమాత్రం తీసిపోని జట్టు బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ (RCB).. గత సీజన్ వరకు ఒక్కటంటే ఒక్క ట్రోఫీని సాధించకపోయింది. మూడేళ్ల ముందు ఐపీఎల్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ సైతం కప్పు కొట్టినా.. ఆర్సీబీ మాత్రం ఎంత ప్రయత్నించినా విజేతగా నిలకపోవడం ఆశ్చర్యమే. అలా అని ఆ జట్టు ఎప్పుడూ బలంగా లేదా బాగా ఆడలేదా అంటే అదేమీ కాదు. పలు సీజన్లలో బాగా ఆడింది. మూడుసార్లు ఫైనల్ చేరింది. కానీ కప్పును మాత్రం అందుకోలేకపోయింది. విరాట్ ఆటగాడిగా, కెప్టెన్‌గా కప్పు కల నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించాడు. కానీ ప్రతిసారీ నిరాశే మిగిలింది. ఈ సీజన్‌కు రజత్ పాటీదార్‌ను కెప్టెన్‌గా ప్రకటించినపుడు నిట్టూర్పులే వినిపించాయి. మెగా వేలం తర్వాత జట్టును చూస్తే అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. దీంతో ఈ సీజన్లోనూ కప్పు కల నెరవేరడం కష్టమే అనుకున్నారు అభిమానులు.
కోహ్లితో పాటు ద్రవిడ్, కుంబ్లే, యువరాజ్ సింగ్, గేల్, డివిలియర్స్, వాట్సన్.. ఇలా ఎందరో మహా మహా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టు ఆర్సీబీ. వీరికి మరెంతోమంది స్టార్లు తోడైనా ఆ జట్టు కప్పు సాధించలేకపోయింది. కోహ్లి, గేల్, డివిలియర్స్ కలిసి ఆడినపుడు ఆ జట్టుకు తిరుగులేదనిపించేది. కానీ ముగ్గురూ ఎంత గొప్పగా ఆడినా.. సమష్టితత్వం కొరవడో, కీలక మ్యాచ్‌ల్లో బౌలింగ్ వైఫల్యం వల్లో ఆ జట్టు ట్రోఫీకి దూరమయ్యేది. కోహ్లి(Kohli) సహా కొందరు స్టార్ల మీద అతిగా ఆధారపడడం కూడా జట్టుకు చేటు చేసేది. కానీ ఈసారి ఆర్సీబీ ఆటలో స్పష్టమైన మార్పు కనిపించింది. కోహ్లి గొప్పగా రాణించాడు కానీ.. బ్యాటింగ్ భారం మొత్తం అతనే మోయలేదు. సాల్ట్ మెరుపు ఆరంభాలతో జట్టుకు ఉపయోగపడ్డాడు. పడిక్కల్, పాటీదార్ ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్ ఫినిషర్ పాత్రలు పోషించారు. ఇలా బ్యాటింగ్ విభాగం సమష్టిగా సత్తా చాటింది. గతంలో టాప్ ఆర్డర్ విఫలమైతే బెంగళూరు తేలిపోయేది.
కానీ ఈసారి అలాంటి తడబాటు కనిపించలేదు. ఇక ఆర్సీబీలో కనిపించిన అతి పెద్ద మార్పు.. బౌలింగ్‌లో నిలకడ. ఎంత స్కోరు చేసినా కాపాడుకోలేకపోయే బలహీనత ఈసారి కనిపించలేదు. హేజిల్‌వుడ్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించి జట్టుకు అతి పెద్ద బలంగా మారాడు. అతను ప్రతి మ్యాచ్‌లో కీలక దశలో వికెట్లు తీస్తూ జట్టుకు భరోసానిచ్చాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌ల్లోనూ అతను గెలిపించాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్ అతడికి చక్కటి సహకారం అందించారు. స్పిన్నర్ కృనాల్ పాండ్య ఫైనల్ సహా కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలిపించాడు. కెప్టెన్ రజత్ పాటీదార్ వనరులను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటూ.. ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశాడు. ఇలా ఆర్సీబీకి అన్నీ కలిసొచ్చి ఛాంపియన్‌గా నిలిచింది.
కెరీర్ ఆరంభంలోనే వన్డే ప్రపంచకప్ (2011) సాధించాడు. నిరుడు టీ20 ప్రపంచకప్‌ను అందుకున్నాడు. 2013లో, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలూ గెలిచాడు. ఇక సిరీస్ విజయాలైతే కోకొల్లలు. ఇన్ని సాధించిన కోహ్లికి ఐపీఎల్ ట్రోఫీ మాత్రం ఎండమావే. నిన్నా మొన్న వచ్చిన జూనియర్ ఆటగాళ్లు కూడా కప్పు సంబరంలో భాగమవుతుంటే విరాట్ మాత్రం.. ప్రతిసారీ పరాజితుడిగా మిగులుతుంటే అభిమానుల వేదన అంతా ఇంతా కాదు. 2016లో విరాట్ అసామాన్య ప్రదర్శన, ఆర్సీబీ ఆధిపత్యం చూసి ఈసారి కప్పు నెగ్గినట్లే అని అభిమానులు ధీమాగా ఉంటే.. ఫైనల్లో గుండెకోత తప్పలేదు. విరాట్ ప్రతి సీజన్లో నిలకడగా ఆడుతున్నా.. కొన్ని సీజన్లలో పరుగుల వరద పారించినా.. జట్టుకు కప్పు సాధించి పెట్టలేకపోయాడు. అయినా నిరాశ చెందక తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఈసారి కూడా జట్టులో అతనే టాప్‌స్కోరర్. టోర్నీలో మొత్తంగా మూడో అత్యధిక పరుగుల వీరుడు. ఈసారి మాత్రం తన శ్రమకు తగిన ఫలితం దక్కింది.
అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సాధించినా.. ఐపీఎల్‌లో మాత్రం కప్పు సాధించలేకపోవడం విరాట్ కెరీర్లో పెద్ద లోటుగా ఉండేది. కెరీర్ చరమాంకంలో ఉండడంతో ఇక ఆ కల నెరవేరకుండానే అతను ఆటకు టాటా చెప్పేస్తాడా అని అభిమానులు కంగారు పడ్డారు. కానీ ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ విరాట్ ఖాతాలో చేరడంతో తన కెరీర్ పరిపూర్ణం అయినట్లయింది. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానుల సంబరం కూడా అంతా ఇంతా కాదు. తమ జట్టు గెలిచినా, ఓడినా ఆర్సీబీ అభిమానులు చూపే ప్రేమ, ఇచ్చే మద్దతే వేరుగా ఉంటుంది. తమ జట్టు ఎన్నిసార్లు విఫలమైనా ఆశ కోల్పోలేదు. ఈ అభిమానం చూసే కోహ్లి కూడా కప్పు గెలవాలని ఎంతో పట్టుదలను ప్రదర్శిస్తూ వచ్చాడు. ఇప్పుడు అది అందగానే ఎక్కడ లేని ఉద్వేగానికి గురయ్యాడు. ఇక అభిమానుల సంబరమైతే మామూలుగా లేదు.