రిలయన్స్ చేతికి అమెరికా కంపెనీ .. డీల్ రూ.256 కోట్లు
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సౌర శక్తి సాఫ్ట్వేర్ డెవలపర్ సెన్స్‌హాక్‌లో మెజారిటీ వాటాను 32 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.256 కోట్ల)తో కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో వేగంగా అడుగులు వేయాలని భావించడంతో పాటు, తన చమురు, రసాయనాల వ్యాపారంలో కర్బన సమ్మేళనాలను తగ్గించే ప్రక్రియలో భాగంగా సెన్స్‌హాక్‌లో 79.4 శాతం వాటాను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. 2018లో ఏర్పాటైన సెన్స్ హాక్ ప్రత్యేకంగా సౌర పరిశ్రమ కంపెనీలకు టూల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. కంపెనీ ఇప్పటిదాక 15 దేశాల్లో 140కిపైగా ఖాతాదార్లకు కొత్త సాంకేతికతను అందించింది.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ 2.3 మిలియణ్ డాలర్ల టర్నోవరు నమోదు చేసింది. సెన్స్‌హాక్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడంతో పాటు భవిష్యత్ వృద్ధి ఉత్పత్తుల వాణిజ్య ఆవిష్కరణ, ఆర్ అండ్ డీ నిమిత్తం 32 మిలియన్ డాలర్లను వెచ్చించేలా ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రిలయన్స్ పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా ఈ కొనుగోలును పూర్తి చేయనున్నట్లు రిలయన్స్ తెలిపింది.






