IPL-Kohli: 18 ఏళ్ల నిరీక్షణ కలనెరవేరింది.. సంబరాల్లో రెడ్ ఆర్మీ..!

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈసాలా కప్ నమదు అంటూనే వచ్చింది బెంగుళూరు . అరివీర భయంకరమైన బ్యాటింగ్ లైనప్.. కళ్లు చెదిరే బౌలింగ్.. ఫీల్డింగ్ లో సరేసరి.. కానీ కప్పుల విషయానికొచ్చేసరికి మాత్రం… లంకె కుదరడం లేదు. దీంతో 18 ఏళ్లుగా కప్పుకోసం కలలు కంటూనే వస్తోంది ఆర్సీబీ. అయితే ఈసారి మాత్రం ఆదాహం తీరింది. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బెంగుళూరు కప్పు కల నెరవేరింది కూడా.
18వ సీజన్.. 18వ నంబర్ జెర్సీ.. 18 ఏళ్ల నిరీక్షణ.. ఈ సంఖ్యతో విరాట్ కోహ్లీ (Virat Kohli) కి విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ.. ఈ సీజన్‌లోనే ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించాడు. ఇన్నేళ్లు ఎన్నో అవమానాలను తట్టుకుంటూ.. ఎప్పుడూ ఊరిస్తూ చివరికి చేజారే కప్పును ఈసారి ఒడిసిపట్టాడు. అభిమానుల ఆశలతో పాటు తన సుదీర్ఘ కలను నెరవేర్చుకున్నాడు.
ఆర్సీబీ అంటే విరాట్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) అంటే విరాట్ కోహ్లీ.. విరాట్ అంటే ఆర్సీబీ అనే స్థాయికి అతడి బ్రాండ్ చేరిందంటే జట్టులో ఎంత విలువైన ఆటగాడో ఆర్థం చేసుకోవచ్చు. ఆ జట్టు ప్రయాణంలో తొలి నుంచి ఉన్న ఏకైక ఆటగాడు అతడే. ఎన్నో ఏళ్లు ఆ జట్టుకు సారథ్యం వహించినప్పటికీ.. .. చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ.. టైటిల్‌ను మాత్రం చేరుకోలేకపోయాడు. తనకంటే జూనియర్లు కప్పును ముద్దాడుతుంటే చూసి కుమిలిపోయాడు. ఇక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అని.. తనలో తానే ఆత్మవిశ్వసం నింపుకొని ముందుకుసాగాడు. ఈ 18వ సీజన్‌ను దూకుడుగా ప్రారంభించాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. చివరికి కప్పును చేతపట్టాడు.
టన్నుల కొద్దీ పరుగులు..
కోహ్లీ అంటే పరుగుల వీరుడు, రికార్డుల రారాజు. ఇప్పటి వరకూ ఆడిన అన్ని సీజన్లలో ఫలితాలు ఎలా ఉన్నా.. తాను మాత్రం జట్టుకు నిలకడగా పరుగులు అందిస్తూ ముందుకు సాగాడు. ఇప్పటి వరకూ 267 మ్యాచ్‌లు ఆడి 8,661 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా అతడే. ఇక ఈ సీజన్‌లో మరోసారి తన సత్తా చాటాడు. దూకుడుగా ఆడుతూ.. అవసరమైనప్పుడు యాంకర్ రోల్ పోషిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆడిన 15 మ్యాచ్‌ల్లో 657 పరుగులు చేసి తన పరుగుల దాహం తీరనిది అని నిరూపించుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఫైనల్‌లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ.. అది జట్టు అవసరాల మేరకే అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఇక ఈ సీజన్‌లో కోహ్లీ ఏకంగా ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అర్ధసెంచరీల పరంగా విరాటే టాప్‌లో ఉన్నాడు. వ్యక్తిగత అత్యధికం 73* పరుగులు.
అందుకే ఆ భావోద్వేగం..
ఫైనల్‌లో విజయం సాధించగానే విరాట్ మైదానంలో కుప్పకూలి భావోద్వేగానికి గురయ్యాడు. ఆ భావోద్వేగం వెనక ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఉంది. అందుకే చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడూ మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీని ఇలా చూసిన అభిమానులు.. నిజమైన హీరో అంటే కోహ్లీ అని అంటున్నారు.
‘తేదీ’ కూడా ప్రత్యేకమే..
ఇక కోహ్లీ కెరీర్‌లో 18వ నంబర్ మ్యాజిక్ కొనసాగుతోంది. ఐపీఎల్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన జూన్ 3 కూడా అతడి కెరీర్‌లో ఎంతో ప్రత్యకంగా నిలవనుంది. ఎందుకంటే ఈ తేదీ (03-06-2025) లోని అన్ని అంకెలను కలిపినా.. చివరికి వచ్చేది ‘18’. అందుకేనేమో.. కోహ్లీకి, ఆ జట్టుకు ఈ సీజన్‌లో అన్నీ కలిసివచ్చాయని అభిమానులు అంటున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సాధించిన కోహ్లీ.. ఇప్పుడు తన సుదీర్ఘ స్వప్నం అయిన ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి తన కెరీర్‌లోని లోటును పూడ్చుకున్నాడు. ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ విరాట్ ఖాతాలో చేరడంతో తన కెరీర్ పరిపూర్ణం అయ్యింది. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానుల సంబరాలు కూడా అంబరాన్నంటాయి.