Mumbai: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రేలు

మరాఠాల హృదయాధినేత బాలాసాహెబ్ చేయలేని పని.. 20 ఏళ్ల తర్వాత ఆవిష్కృతమైంది. ఠాక్రే కుటుంబం ఒకే వేదికపై ఆసీనులయ్యారు. అంతేకాదు.. తాము త్రిభాషా విధానంపై కలసికట్టుగా పోరాడతామని స్ఫష్టం చేశారు. అయితే ఇద్దరు ఠాక్రేలను ఒకే వేదికపై చూసిన .. బాలాసాహెబ్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు.
విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray), రాజ్ ఠాక్రేలు (Raj Thackeray) దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్రలో త్రిభాషా విధానం (Three Language policy) అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో ఇది ప్రతిపక్షాల విజయంగా పేర్కొంటూ.. ముంబయి వేదికగా ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ ఠాక్రేలు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2005లో విడిపోయిన వీరు దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారనుంది.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రాజ్ ఠాక్రే. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం ద్వారా మన పిల్లలు సరైన విషయాలు నేర్చుకొనే అవకాశం లేకుండా పోతోందని మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలో ఎందరో సినీనటులు, రాజకీయ నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ తమ మాతృభాషలైన తెలుగు, తమిళం వంటి భాషల విషయంలో ఎంతో గర్వంగా ఉంటారన్నారు. అలాగే మహారాష్ట్ర నేతలకు, ప్రజలకు కూడా తమ భాషపై అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. తమకు హిందీ భాషపై వ్యతిరేకత ఎప్పుడూ లేదని రాజ్ అన్నారు. అయితే ఇతరులపై ఆ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తమ పూర్వీకులు మరాఠా సామాజ్రాన్ని ఎన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ ఎప్పుడూ అక్కడి వారిపై మరాఠీని బలవంతంగా రుద్దలేదని రాజ్ పేర్కొన్నారు. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలపై త్రిభాషా సూత్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టులలో అన్ని ఉత్తర్వులు ఆంగ్లభాషలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని ఈ విధానాన్ని మహారాష్ట్రపై రుద్దాలని చూస్తే.. ఏం జరుగుతుందో ఇప్పటికైనా కేంద్రం తెలుసుకోవాలని హెచ్చరించారు.
తమను ఒకచోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని.. చివరికి బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. అనుకోకుండానే ఆయన తమని ఒకే వేదిక పైకి తీసుకువచ్చారని అన్నారు. ఇకపై రాష్ట్ర ఐక్యత విషయంలో తాము ఎప్పటికీ ఒక్కటిగా ఉంటామని పేర్కొన్నారు.