Congress: శానిటరీ ప్యాడ్లపై రాహుల్ గాంధీ చిత్రం.. కాంగ్రెస్‌పై విమర్శలు!

బీహార్‌లో కాంగ్రెస్ (Congress) పార్టీ చేపట్టిన ఉచిత శానిటరీ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళల్లో ఋతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’ కింద ఈ ప్యాడ్లను పంపిణీ చేస్తుండగా, ప్యాకెట్లపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చిత్రాన్ని ముద్రించడంపై బీజేపీతో సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. బీహార్‌లో ‘ఇండియా బ్లాక్’ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘మాయీ బహిన్ సమ్మాన్ యోజన’ కింద మహిళలకు ₹2500 స్టైఫండ్ అందిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ (Congress) చీఫ్ రాజేష్ కుమార్ తెలిపారు. అందులో భాగంగానే ఈ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే 5 లక్షలకు పైగా బాక్సులను ఉచితంగా అందించామని ఆయన వివరించారు.
ఈ ప్యాకెట్లపై రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చర్యపై అధికార జేడీ(యూ) ప్రతినిధి నీరజ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. “రాష్ట్రంలో మహిళలను శక్తిమంతం చేయడానికి, వారి సాధికారత కోసం, సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (CM Nitish Kumar) నిరంతరం కృషి చేస్తున్నారు. మహిళలు గౌరవానికి చిహ్నం. కానీ మీరు మాత్రం ఇలా అహంకారపూరితంగా మీ శక్తిని ప్రదర్శించడానికి శానిటరీ ప్యాడ్స్‌పై మీ ముఖాన్ని ముద్రించుకున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాంగ్రెస్‌కు (Congress) అసలు ఏమైంది? రాజకీయాల్లో ఇలాంటి చర్యలను తెలివిలేనితనం, సైద్ధాంతిక శూన్యత అంటాం. ఎన్నికలు దగ్గర పడుతుండటంతోనే ఇలా చేస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆలోచనలేని ఎన్నికల స్టంట్ (ఎలక్షన్ గిమ్మిక్కు)” అని నీరజ్ కుమార్ విమర్శించారు.