Rahul Gandhi: ఎన్నికల మ్యాచ్‌ఫిక్సింగ్‌కు మహారాష్ట్రే ఉదాహరణ.. ఈసీ, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్!
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి బీజేపీపై విమర్శలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని, రిగ్గింగ్ ద్వారానే వారు గెలిచారని ఆరోపించారు. బీహార్‌లోనూ అదే తంతు పునరావృతం కావచ్చని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రాహుల్ తన ఆందోళనను వ్యక్తపరిచారు. ‘‘2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల రిగ్గింగ్‌కు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌లో నియామక ప్రక్రియ, నకిలీ ఓటర్ల చేర్పు, ఓటింగ్ సమయంలో జరిగిన అవకతవకలు — ఇవన్నీ ఒకే దిశగా నడిచాయి. ఆధారాలను దాచిపెట్టడం ద్వారా ప్రజల చైతన్యాన్ని కమ్మేస్తున్నారు. ఈ వ్యవస్థ పట్ల ప్రజలు నమ్మకం కోల్పోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని అన్నారు.
‘‘ఎన్నికల్లో రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదే. క్రీడలో మోసం చేసినవాళ్లకు విజయం సాధ్యమే. కానీ ఆ గెలుపు క్రీడా స్ఫూర్తిని ధ్వంసం చేస్తుంది. అదే విధంగా ఎన్నికలలో మోసపూరిత విజయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారతాయి’’ అని రాహుల్ చెప్పారు. మహారాష్ట్ర తరహాలోనే రాబోయే బీహార్ ఎన్నికల్లోనూ ఇటువంటి కుట్రలు జరిగే అవకాశముందని రాహుల్ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్దిష్టమైన ఆధారాలను పరిశీలించి ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ‘‘ప్రజాస్వామ్యం కాపాడుకోవాలంటే, జాగృతి, విజ్ఞానం, స్పందన అవసరం,’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.






