Rahul Gandhi: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు ముహూర్తం ఫిక్స్

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) త్వరలోనే మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటిస్తారని పార్టీ నాయకుడు పవన్ ఖేరా వెల్లడించారు. పవన్ ఖేరా తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఏప్రిల్ 21, 22 తేదీల్లో యూఎస్‌లో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇందులో భాగంగా, రోడ్ ఐలాండ్‌లోని ప్రఖ్యాత బ్రౌన్ విశ్వవిద్యాలయాన్ని ఆయన (Rahul Gandhi) సందర్శిస్తారు. అక్కడ విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖి మాట్లాడతారు. అంతకు ముందు, రాహుల్ గాంధీ అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన సంఘాల సభ్యులతో పాటు ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) సభ్యులతో కూడా సమావేశం కానున్నారు. కాగా, గతేడాది సెప్టెంబరులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన భారతదేశంలో రిజర్వేషన్లు, మత స్వేచ్ఛ వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారానికి దారితీశాయి. ముఖ్యంగా సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడంతోపాటు విదేశాలలో భారతదేశ ప్రతిష్టను రాహుల్ దిగజారుస్తున్నారని మండిపడింది.