Bihar: బిహార్ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ వీరే..!
బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరంచేసింది. తొలి దశ ఎన్నికల కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు చోటు కల్పించింది.
పార్టీ తరఫున ప్రచారం చేయనున్న ప్రముఖులలో కన్హయ్య కుమార్, స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ (రాజేష్ రంజన్) కూడా ఉన్నారు. వీరితో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, భూపేష్ బఘేల్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, సయ్యద్ నసీర్ హుస్సేన్ వంటి కీలక నేతలు బిహార్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, దిగ్విజయ్ సింగ్, అధిర్ రంజన్ చౌదరి, మీరా కుమార్, తారిఖ్ అన్వర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
బీహార్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కృష్ణ అల్లవారపు, పీసీసీ అధ్యక్షుడు రాజేష్ రామ్, సీనియర్ నేతలు గౌరవ్ గొగోయ్, మహమ్మద్ జావేద్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్ వంటి స్థానిక నేతలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు భాగస్వాములుగా ఉన్న ‘ఇండియా’ కూటమి, తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించాయి..







