Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా రాహుల్ పాలిటిక్స్..

ఉపఎన్నికల్లో కాస్త నిరాశాజనకమైన ఫలితాలు రావడంతో కాస్త నెమ్మదించినట్లు కనిపించిన కాంగ్రెస్… మళ్లీ స్పీడు పెంచింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తన టార్గెట్ విస్తరించారు. ఇప్పుడు మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలవంతంగా దేశంపై రుద్దుతోందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మోడీ(Modi) సైతం ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan bhagawat) దేశద్రోహి అంటూ నిందిస్తున్నారు రాహుల్. దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే, అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాతే …అసలైన స్వాతంత్రం వచ్చిందంటున్నారని ఫైరయ్యారు కూడా. అసలు భారత రాజ్యాంగం, పార్లమెంటుపై ఆర్ఎస్ఎస్ కు భక్తి, ప్రేమ లేదంటున్నారు. తాము అనుకున్నదే వేదం, అదే అందరూ పాటించాలని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
ఇటీవలి కాలంలో బీజేపీకి ఎన్నికల్లో మిశ్రమఫలితాలు ఎదురవుతున్నాయి. అలాంటి చోట్ల ఆర్ఎస్ఎస్ సాయంతో ఆపార్టీ మళ్లీ పుంజుకుని అధికారం పీఠం అధిరోహిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మధ్యప్రదేశ్. అసలు అక్కడ కాంగ్రెస్ డ్యామ్ షూర్ అనుకున్న స్థాయి నుంచి నెమ్మదిగా మళ్లీ బీజేపీ అధికార పీఠం దక్కించుకుంది. అప్పటి సీఎం శివరాజ్ సింగ్ ను తప్పించడం వెనక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. వ్యాపం కుంభకోణం సహా పలు అంశాల ప్రభావం అధికంగా ఉండడంతో… ఆయన్ను తప్పించింది.
ఊరూవాడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడం, కాంగ్రెస్ మితిమీరిన విశ్వాసం వెరసి.. అధికారం కమలాన్నే వరించింది. దీంతో ఆర్ఎస్ఎస్ కారణంగా బీజేపీ గెలుపు సునాయాసం అవుతుందని గ్రహించిన రాహుల్.. ఇప్పుడు నేరుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. దేశం ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ప్రజలు ఎలా బతకాలో మోహన్ భగవత్ నిర్ధేశించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అయితే దీన్ని అప్పుడప్పుడు బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఆర్ఎస్ఎస్ మాత్రం .. దీన్ని పక్కా రాజకీయ క్రీడగా భావిస్తోంది. అసలు రాహుల్, కాంగ్రెస్ విమర్శలపై స్పందించడం లేదు. తాను చెప్పాల్సింది వివిధ వేదికలపై మోహన్ భగవత్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే బీజేపీ అక్కడక్కడ చేస్తున్న తప్పులపై మాత్రం ఆర్ఎస్ఎస్ నిలదీస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.