Priyanka Gandhi: మోడీ ఎందుకు మణిపూర్ వెళ్లరు? నిలదీసిన ప్రియాంక గాంధీ

ఈశాన్య భారతదేశంలో మళ్లీ అల్లర్ల మంటలు మండుతున్నాయి. మణిపూర్‌లో (Manipur) మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజాగా మైతేయి సంఘానికి చెందిన అరంబై టెంగోల్ గ్రూప్ నాయకుడు కానన్ సింగ్‌తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది. ఈ అరెస్టులు ఇంఫాల్ వ్యాలీలో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. ముఖ్యంగా ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబల్, బిష్ణుపూర్, కక్చింగ్ జిల్లాల్లో ప్రజలు నిరసనలకు దిగడంతో అధికారులు వెంటనే కర్ఫ్యూ విధించారు. భద్రతా పరంగా కీలకమైన ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా మణిపూర్‌లో అస్థిరత కొనసాగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా రాష్ట్రానికి వెళ్లకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నా కూడా శాంతి నెలకొనకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 మే 3న మైతేయి, కుకీ-జో గిరిజన సమాజాల మధ్య ప్రారంభమైన విభేదాలు ఇప్పటికీ తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మణిపూర్ (Manipur) అల్లర్లలో ఇప్పటివరకు 258 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 60,000 మంది తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.