Manipur : మణిపూర్‌లో బీజేపీ చేతకానితనం..! రాష్ట్రపతిపాలన విధింపు..!!

మణిపూర్ (Manipur) గత రెండేళ్లుగా రావణకాష్టంలా రగులుతోంది. రెండు జాతుల మధ్య తలెత్తిన ఘర్షణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో హంస చెలరేగి వేలాది మంది చనిపోయారు. లక్షలాది మంది ఇళ్లు వదిలేసి పారిపోయి తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో తలెత్తిన హింసను కంట్రోల్ చేయడంలో బీజేపీ (BJP) ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (Biren Singh) పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్త గళం వినిపించారు. దీంతో ఇటీవలే బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని అందరూ ఆశించారు. అయితే అనూహ్యంగా రాష్ట్రపతి పాలన (Presidential rule) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిర్ణయం తీసుకుంది.
మణిపూర్ అసెంబ్లీ (Manipur Assembly) పదవీకాలం 2027 మార్చి వరకూ ఉంది. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. మొత్తం 60 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి 37 మంది సభ్యుల బలం ఉంది. మొత్తం ఎన్డీయేకి (NDA) 46 మంది సభ్యులున్నారు. ఇంతటి మెజారిటీ ఉన్న రాష్ట్రాన్ని సహజంగా ఏ పార్టీ పాలించేందుకు వెనుకాడదు. ఇన్నాళ్లూ బీజేపీ నేత బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే తాజాగా బీరేన్ సింగ్ రాజీనామాతో మణిపూర్ లో సంపూర్ణ మెజారిటీ ఉన్నా రాష్ట్రపతి పాలన వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న బీజేపీ.. మణిపూర్ ని మాత్రం వదులుకునేందుకు సిద్ధపడిందంటే ఆశ్చర్యం కలిగిస్తోంది.
మణిపూర్ లో మైతేయి (Mytei), కుకీ (Kuki) తెగల మధ్య యుద్ధం జరుగుతోంది. 2023 నుంచి ఈ రెండు తెగల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లను అదుపు చేయడంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పూర్తిగా విఫలమయ్యారు. పైగా అల్లర్లను ప్రోత్సహించేలా ఆయన మాట్లాడిన ఆడియోలు ఇటీవల బయటికొచ్చాయి. ఇది అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. దీంతో బీరేన్ సింగ్ చేత రాజీనామా చేయించింది బీజేపీ హైకమాండ్. అయితే ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని అందరూ ఆశించారు. అయితే ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, జాతుల మధ్య వైరం కంటిన్యూ అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించినా ఇబ్బందులు తప్పవని బీజేపీ హైకమాండ్ భావించింది. పైగా గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కూడా ఈ మేరకు కేంద్ర హోంశాఖకు (Home Ministry) రిపోర్ట్ ఇచ్చారు. దీంతో రాష్ట్రపతి పాలన (President’s rule) విధిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి కార్యాలయం దీన్ని ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేసింది. అయితే మణిపూర్ లో బీజేపీ చేతులెత్తేసిందని, వెంటనే అక్కడ ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపే పరిస్థితి లేకపోవడం బీజేపీ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేస్తోంది.