Modi : వారితో మా పాలనను పోల్చిచూడండి : మోదీ

కెన్- బెత్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh ) లోని ఖజురహో (Khajuraho)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. కెన్-బెత్వా(ken betwa) నదుల నుంచి తీసుకువచ్చిన నీటి కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. అయితే ఆ కలశాల్లో ఉన్న నీటిని ప్రాజెక్టుకు చెందిన నమోనా మోడల్‌పై ప్రధాని మోదీ పోశారు. మధ్యప్రదేశ్‌లోని 10 జిల్లాలలకు చెందిన 44 లక్షల మందికి, యూపీకి చెందిన 21 లక్షల మందికి నదీ అనుసంధానం ప్రాజెక్టుతో తాగునీటిని అందించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 44 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండు వేల గ్రామాల్లోని 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఇతర పార్టీల పాలనతో పోల్చి చూడాలని మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని మేధావులు కొన్ని ప్రమాణాలను తీసుకొని కాంగ్రెస్, లెఫ్ట్, కుటుంబ, సంకీర్ణ పార్టీల పాలనలో ఏం పనులు జరిగాయి? బీజేపీ ఉన్న చోట్ల అభివృద్ధి ఎలా జరిగిందో విశ్లేషించాలి. మా పార్టీ ప్రజల కోసం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎంత వరకు చేరాయి అన్నదే ప్రామాణికం అని అన్నారు.