చర్చలకు రండి… జమ్మూ కశ్మీర్ నేతలకు కేంద్రం ఫోన్లు

జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రక్రియను వేగవంతం చేసే చర్యల్లో భాగంగా అక్కడి అన్ని రాజకీయపక్ష నేతలతో చర్చలు జరపాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖా కార్యదర్శి అజయ్ భల్లా వివిధ రాజకీయ పక్షాలకు ఫోన్లు చేసి, చర్చలకు ఆహ్వానించారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, అదే పార్టీకి చెందిన నేత ఒమర్ అబ్దుల్లాను కూడా చర్చలకు ఆహ్వానించారు. ఇక, మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కూడా అజయ్ భల్లా ఫోన్ చేసి, చర్చలకు ఆహ్వానించారు. వీరితో పాటు కాంగ్రెస్, వామపక్షాలతో సహా మొత్తం 14 పార్టీలకు ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు.
ఫోన్లు వచ్చాయి… ధ్రువీకరించిన నేతలు
ఢిల్లీకి చర్చలకు రావాలంటూ తమకు కేంద్రం నుంచి ఫోన్ వచ్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా ధ్రువీకరించారు. ఇక మరో కీలక నేత, మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా కేంద్రం నుంచి ఫోన్ వచ్చిందని ధ్రువీకరించారు. అయితే సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అన్నది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎన్నికలు, రాష్ట్ర హోదా అంశాలే ఎజెండా…
అతి త్వరలోనే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు అక్కడ ఎన్నికలను కూడా నిర్వహించాలని తలపోస్తోంది. ఈ రెండు అంశాలపై ప్రధాని మోదీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. 2018 లో మెహబూబా ముఫ్తీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలు సాగడం లేదు. అయితే సాధారణ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం తలపోసింది. అయితే భద్రతా, స్థానిక కారణాల రీత్యా కేంద్రం వెనకడుగు వేసింది. ఇప్పుడు ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనలో మోదీ సర్కార్ ఉంది.