Parliament: జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు సంబంధించిన విషయాలపై పార్లమెంట్ (Parliament) ప్రత్యేక సమావేశంలో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju ) ప్రకటించారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి (Terrorist attack) నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై చర్చించనున్నట్లు తెలిసింది. అంతకాదు 23 రోజుల పాటూ జరిగే ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.