Nishikant Dubey: సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే.. పార్లమెంటును మూసివేయండి: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే

వక్ఫ్ సవరణ చట్టం, రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంపై కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) జారీ చేసిన ఆదేశాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతికి గడువు విధించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం సమంజసం కాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. “సుప్రీంకోర్టు చట్టాలు చేయడం మొదలు పెడితే.. ఇక పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి” అని దూబే తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు మూడు నెలల గడువును విధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే, రాష్ట్రాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది. అయితే, ఈ పరిణామాలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నిర్దిష్ట సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించకూడదని ఆయన వాదించారు. ప్రజాస్వామ్య సంస్థలపై సుప్రీంకోర్టు అణ్వాయుధాన్ని ప్రయోగించకూడదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను స్వాగతిస్తున్నాయి.