Rahul Gandhi: భారత్‌లో కూడా నేపాల్ తరహా జెన్ జీ ఉద్యమం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. త్వరలో భారతదేశంలో కూడా నేపాల్‌లో జరిగినట్లే జెన్-జీ (Gen Z Protest) ఉద్యమం వస్తుందని జోస్యం చెప్పారు. ఓట్ల చోరీపై యువత, విద్యార్థులు తిరుగుబాటు చేయడం ఖాయమని ఆయన అన్నారు. యువతతో కలిసి తాను కూడా రోడ్డెక్కుతానని ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని కాపాడడమే అందరి తక్షణ కర్తవ్యమని రాహుల్ (Rahul Gandhi) పిలుపునిచ్చారు. ఇటీవల నేపాల్‌లో అవినీతి, సోషల్ మీడియా బ్యాన్‌పై యువతరం ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రభుత్వాన్ని కూడా జెన్ జీ (Gen Z Protest) ఉద్యమం కూల్చేసింది. ఈ క్రమంలో నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
అంతకుముందు, ఢిల్లీలో మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుండి ఓట్లను తొలగించారని ఆయన ఆరోపించారు. నకిలీ లాగిన్‌లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారని, ఇది ఒక సాఫ్ట్‌వేర్ ఆధారిత, కేంద్రీకృత పద్ధతిలో జరిగిందని పేర్కొన్నారు.