NDA-INDIA: రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేడ్కర్ ను విపక్షాలు ఓన్ చేసుకుంటున్నాయా..?

పదే పదే అంబేడ్కర్(Ambedkar) పేరును జపించే బదులు.. ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మలదాకా స్వర్గ ప్రాప్తి లభించేదని అమిత్ షా(Amith shah) మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేడ్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతోపాటు రాజీనామా చేయాలని లేదంటే ప్రధాని ఆయనను తొలగించాలని డిమాండు చేసింది. కాంగ్రెస్‌కు విపక్షాలు తోడవడంతో పార్లమెంటు(parliament ) స్తంభించిపోతోంది.. మరోవైపు దేశవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.
అయితే అధికార ఎన్డీఏ కూటమి మరీ ముఖ్యంగా బీజేపీ.. కాంగ్రెస్, ఇండియా కూటమికి గట్టిగానే కౌంటరిస్తోంది.కాంగ్రెస్సే ఇప్పటిదాకా అంబేడ్కర్‌ను అవమానిస్తూ వస్తోందని, తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. అంబేడ్కర్‌పై తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గతంలోనూ ఆ పార్టీ ఇలాగే వ్యవహరించిందని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎన్డీయే నేతలు కృషి చేస్తున్నారనే అక్కసుతో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్సే అంబేడ్కర్ వ్యతిరేకి. రిజర్వేషన్ల వ్యతిరేకి. మా పార్టీ ఎన్నడూ అంబేడ్కర్‌ను అవమానించలేదు’ అని స్పష్టం చేశారు.
‘నాలాంటి కోట్ల మంది ప్రజలకు అంబేడ్కర్ దేవుడనే విషయాన్ని మంత్రులు, మోడీ ప్రభుత్వం గుర్తెరగాలి. ఆయన దేవుడి కంటే తక్కువేం కాదు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, పేదలకు అంబేడ్కర్ మహాపురుషుడు’ అని ఖర్గే(kharge) ఎక్స్‌లో స్పందించారు. అలాంటి నేతను అవమానించిన అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధానిని ఆయన డిమాండు చేశారు. లేదంటే అమిత్ షానే స్వయంగా వైదొలగాలని మీడియా సమావేశంలో ఖర్గే స్పష్టం చేశారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ(Rahul) డిమాండు చేశారు. బాబాసాహెబ్ సిద్ధాంతాలకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. ‘బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత. దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప నేత. ఆయనను అవమానించడాన్ని దేశం క్షమించదు’ అని రాహుల్ స్పష్టం చేశారు. కోట్ల మంది దళితులు, పేదలకు అంబేడ్కర్ పేరు స్వీయ గౌరవానికి చిహ్నమని ప్రియాంకా గాంధీ(priyanka) వ్యాఖ్యానించారు.