ముంబయి పోలీసులు కీలక ఆదేశాలు .. నవంబర్ 29 వరకు అమల్లో

మహారాష్ట్ర ఎన్నికల వేళ ముంబయి పోలీసులు కీలక ఆదేశాలు ఇచ్చారు. డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హాట్ ఎయిర్‌బెలూన్లు ఎగురవేయడం నిషేధం విధించారు. అక్టోబరు 31 నుంచి నవంబర్ 29 వరకు మొత్తం 30 రోజులు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని అధికారులు వెల్లడించారు. ఉగ్రముప్పు కారణంగా ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. వీవీఐపీలను లక్ష్యంగా చేసుకునేందుకు, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేసేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు వాటిని వినియోగించుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఎగిరేవస్తువుల ద్వారా ఎలాంటి విధ్వంసం జరగకుండా తగిన ఆంక్షలు అవసరమని పేర్కొన్నారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించేవారు శిక్షార్హులని తెలిపారు.