Mohan Bhagwat: కులభేదాలను పూర్తిగా విడనాడాలి: మోహన్ భగవత్

కులాల మధ్య ఉన్న భేదాలను పూర్తిగా విడనాడాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. “ఒకే దేవాలయం, ఒకే నీటి బావి, ఒకే స్మశాన వాటిక” అనే సూత్రానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ సూత్రంతో సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని కోరారు. అలీగఢ్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న మోహన్ భగవత్ ఒక బహిరంగ కార్యక్రమంలో హిందూ ధర్మం విలువలను వివరించారు. “ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి, భారతదేశం మొదట తనలో సామాజిక ఐక్యతను సాధించడం అత్యంత అవసరం. హిందూ సమాజానికి మూలస్తంభాలైన సంస్కారం, సంప్రదాయం, సాంస్కృతిక విలువలు, నైతిక సూత్రాల పేరుతో సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల భేదాల వంటి చీకటి ఆలోచనలను నిర్మూలించాలి” అని ఆయన (Mohan Bhagwat) పిలుపునిచ్చారు.
“నైతిక విలువలను గౌరవిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగాలి. ఎటువంటి వివక్ష చూపకుండా అన్ని వర్గాల ప్రజలను మన ఇళ్లలోకి ఆహ్వానించాలి. సమాజంలో అట్టడుగు స్థాయి నుండి సామరస్యాన్ని, ఐక్యతను వ్యాప్తి చేయాలి. సంస్కారం అనే బలమైన పునాదిపైనే కుటుంబం, దాని విలువలు నిర్మితమవుతాయి. కుటుంబం సమాజంలో ఒక ప్రాథమిక యూనిట్‌గా కొనసాగుతుంది. జాతీయవాదం, సామాజిక ఐక్యత పునాదులను మరింత బలోపేతం చేయడానికి అన్ని పండుగలను సామూహికంగా జరుపుకోవడం చాలా ముఖ్యం” అని మోహన్ భగవత్ (Mohan Bhagwat) పేర్కొన్నారు.