Semiconductor : మరో సెమీ కండక్టర్ యూనిట్‌కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

సెమీ కండక్టర్ల విషయంలో దేశ స్వావలంబన సాధించే దిశగా కేంద్రం ముందుడు వేసింది. మరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,707 కోట్ల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని జెవార్‌లో ఆరో యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్‌నకు చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn), హెచ్‌సీఎల్ (HCL) సంయుక్తంగా ఈ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్టవ్ (Ashwini Vaishnaw )తెలిపారు. ఇది మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్ ఇతర పరికరాల కోసం డిస్‌ప్లే డ్రైవర్ చిప్‌లను తయారు చేస్తుందని పేర్కొన్నారు.
సెమీ కండక్టర్ల రంగాన్ని మరింత ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సెమీకండక్టర్ యూనిట్ నిర్మాణంతో దాదాపు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. సెమీ కండర్టర్ యూనిట్లలో నెలకు 3.6 కోట్ల చిప్‌లను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. కండక్టర్లకు వాడే పరికరాలు కూడా భారత్‌లో తయారు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 60 శాతం సెమీకండక్టర్ల పరికరాలను అమెరికా కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.