Mallikarjun Kharge: వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ ప్రశ్నలకు సుప్రీంకోర్టు ప్రాధాన్యత: ఖర్గే

వక్ఫ్ (సవరణ) చట్టంలోని వివాదాస్పద అంశాలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు కూడా ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. వక్ఫ్ ఆస్తులపై అనవసరమైన వివాదాలను సృష్టించడానికి ప్రభుత్వం ‘వక్ఫ్ బై యూజర్’ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇంచార్జ్‌లతో జరిగిన సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈడీ ఛార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చారని విమర్శించారు. “నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం ఒక పెద్ద కుట్రలో భాగమని తెలుస్తోంది. ఎవరి పేర్లు చేర్చినా మేము భయపడేది లేదు. దీనికి రెండు మూడు రోజుల ముందు, ఢిల్లీ, లక్నో, ముంబైలలోని నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కూడా అటాచ్ చేశారు. ఇవన్నీ రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగమేనని స్పష్టంగా తెలుస్తోంది” అని ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.
యంగ్ ఇండియన్ లాభాపేక్ష లేని సంస్థ అని ఖర్గే నొక్కి చెప్పారు. దీని షేర్లు, ఆస్తులు లేదా లాభాలను ఎవరూ తీసుకోలేరని, బదిలీ కూడా చేయలేరని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన (Mallikarjun Kharge) అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లను తక్కువ ధరకు బదిలీ చేసి కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొట్టారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న విషయం తెలిసిందే. సోనియా, రాహుల్ గాంధీ రూ. 988 కోట్ల అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.