ఆలోచన లేని హామీలు ఇవ్వొ ద్దన్న ఖర్గే.. ‘కాంగ్రెస్ అసలు రంగు ఇదే’ అంటున్న బీజేపీ

ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల విషయంలో పార్టీ రాష్ట్ర స్థాయి కేడర్‌కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరికలు చేశారు. పథకాలు, గ్యారెంటీల విషయంలో ఆలోచించి హామీలు ఇవ్వాలంటూ ఆయన తమ పార్టీ నేతలకు సూచన చేశారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బడ్జెట్‌ను పూర్తిగా అంచనా వేసిన తర్వాతనే హామీలు ప్రకటించాలని ఖర్గే అన్నారు. ఇలాంటి ప్రణాళికలు లేకుండా గ్యారెంటీలు ఇస్తే ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఖర్గే వ్యాఖ్యలతో రంగంలోకి దిగిన బీజేపీ.. కాంగ్రెస్‌కు చురకలంటించడం మొదలు పెట్టింది. ప్రధాని మోదీ కూడా ఈ వ్యాఖ్యలను టార్గెట్ చేశారు. ‘నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చేయడం ఎవరికైనా ఈజీనే. కానీ వాటిని నిలబెట్టుకోవడం కష్టం. ఆ విషయం ఇప్పుడు కాంగ్రెస్‌కు తెలిసొచ్చింది. ఎక్కడ ప్రచారం చేసినా సరే.. వాళ్లు ఇలాంటి లెక్కలేని, అమలు చెయ్యడం సాధ్యం కాని హామీలు ఇస్తూనే వచ్చారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకవడంతో దేశానికి వాళ్ల అసలు రంగు తెలిసొచ్చింది’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు కూడా గతంలో ఇలా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోకుండా హామీలు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు చేశారు.