కుమార్తెకు గ్రీన్‌కార్డ్ వస్తుందని నమ్మిన వ్యాపారి.. రూ.8 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు
కుమార్తెకు అమెరికా గ్రీన్‌కార్డు వస్తుందని నమ్మిన బిజినెస్‌మేన్‌కు ఆ తర్వాత భారీ షాక్ తగిలింది. గ్రీన్ కార్డ్ గురించి పెద్దగా అవగాహన లేని ఆయన.. కొందరు మోసగాళ్ల మాటలు నమ్మి ఏకంగా రూ.8.33 కోట్లు నష్టపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయేష్ ఠాకూర్ అనే వ్యాపారి ఘట్కోపర్ ప్రాంతంలో ఉంటున్నారు. ఆయన కుమార్తె శ్రియ.. 2015లో అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే వివిధ జాబ్ పోర్టల్స్‌లో ఆమె తన రెజ్యూమేను అప్లోడ్ చేసింది. ఆ తర్వాత ఓ వెబ్సైట్ ద్వారా ఆమెకు జై షా, నిషా దుసారా అనే ఇద్దరితో పరిచయమైంది. అమెరికాలో తమకు బాగా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నట్లు జై, నిషా చెప్పుకున్నారు. ఆ పలుకుబడితో శ్రియకు అమెరికాలో జాబ్, వర్క్ పర్మిట్ ఇప్పిస్తామన్నారు. అవసరం అయితే గ్రీన్‌కార్డు కూడా తెచ్చిపెడతామంటూ నమ్మించారు. ఇలా మాయమాటలు చెప్పి శ్రియ, ఆమె తండ్రి జయేష్ నుంచి విడతల వారీగా 8.33 కోట్లు దండుకున్నారు. ఇలా ఎంత డబ్బు కట్టినా కూతురికి అమెరికా ఉద్యోగం రాకపోవడంతో.. జయేష్‌కు విసుగొచ్చింది. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని గొడవ చేశాడు. దానికి సరేనన్న నిందితులు.. ఆయన్ను నమ్మించటానికి నకిలీ రసీదులు, బ్యాంకు స్టేట్ మెంట్లను చూపించారు. కానీ అతను కట్టిన డబ్బులో ఒక్కపైసా కూడా తిరిగిరాలేదు. దీంతో చివరకు జయేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు జై షా, నిషాలపై సెక్షన్ 420తో పాటూ ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.






