Prayag Raj: జయహో కుంభ్ మేళా.. ఆధ్యాత్మిక వేడుక విజయవంతం కావడంపై మోడీ ట్వీట్..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ్ మేళా(Maha Kumba Mela) విజయవంతంగా ముగిసింది.. 45 రోజులపాటు ఘనంగా జరిగిన కుంభమేళా ఉత్సవాలకు .. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. ముఖ్యంగా కుంభ్ మేళా చివరిరోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు పోటెత్తారు. కాశీ విశ్వనాథ (viswanath)ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మహా శివరాత్రినాడు కుంభమేళా ముగిసింది. మహా కుంభమేళా ముగింపు వేడుకలకు పదివేల మందికిపైగా నాగ సాదువులు కాశీ వీధుల గుండా దేవతా మూర్తుల విగ్రహాలతో ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ భారీ ప్రదర్శన చేపట్టారు. కాగా, చివరి రోజైనా శివరాత్రి నాడు మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
కుంభమేళా చివరి రోజునాడు సుమారు 2 కోట్లకుపైగా మంది భక్తులు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. మహా కుంభమేళా చివరిరోజున హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా అనేక రికార్డులను నమోదు చేసింది. పలు దేశాల జనాభా కంటే ఈ కుంభమేళాకు హాజరైన భక్తుల సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ మహా కుంభమేళా గతంలో ఎన్నడూ లేనంతగా మరింత ఘనంగా, దైవికంగా నిర్వహించారు. దేశం నంచేగాక ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సామాన్యుల నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు పవిత్ర స్నానం ఆచరించడానికి ఈ మహా కుంభమేళాకు చేరుకున్నారు. చివరి రోజు అర్ధరాత్రి వరకు మహా కుంభమేళాలో భక్తులు స్నానమాచరించారు.
మంగళవారం వరకు త్రివేణి సంగమంలో 66 కోట్లకు పైగా ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 13న ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం, 2025 మహా కుంభమేళాలో 45 రోజుల్లో 66.21 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేసి, ప్రపంచంలోని మరే ఇతర కార్యక్రమంలోనూ లేని చారిత్రక రికార్డును సృష్టించారు. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో దాదాపు 50%, ఇది అనేక యూరోపియన్ దేశాల జనాభా కంటే ఎక్కువ.
మహా కుంభమేళాకు తరలివచ్చిన ప్రముఖులు
మహా కుంభ్ మేళాకు పలువురు నేతలు, వీఐపీలు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ప్రయాగ్ రాజ్ లోని పుణ్యస్నానాలు ఆచరించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా రాజకీయ నాయకులు కూడా మహా కుంభమేళాకు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనేక మంది కూడా పవిత్ర స్నానాల కోసం సంగం చేరుకున్నారు. వీరితోపాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, అసెంబ్లీ స్పీకర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు.
దేశంలోని కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు మహా కుంభమేళాకు వచ్చారు. ముఖేష్ అంబానీ తన కుటుంబంతో పాటు, గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ, ఓలాకు చెందిన భవిష్ అగర్వాల్, లక్ష్మీ మిట్టల్, ఆనంద్ పిరమల్, అశోక్ హిందూజా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పవిత్ర స్నానాలు ఆచరించారు.
పూజల్లో లోపం ఉంటే క్షమించాలని గంగామాతను ప్రార్థించిన మోదీ
మహా కుంభమేళా సందర్భంగా పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలు క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. అలాగే, ఏర్పాట్ల విషయంలో లోపాలున్నా, భక్తులెవరైనా అసౌకర్యానికి గురైనా మన్నించాలని కోరారు. మహా శివరాత్రి పండుగ రోజున కుంభమేళా ముగిసింది. 45 రోజుల పాటు జరిగిన ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో 66 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగిసిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
భారతీయుల ఐక్యతకు ఈ కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగించడం సులువైన విషయం కాదని ఆయన అన్నారు. అన్ని సవాళ్లను అధిగమించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని ప్రశంసించారు. ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.