Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్

సీనియర్ ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijah Shah) తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై విచారణ జరిపింది. “మీ మాటలు చూసి మేమే సిగ్గుపడుతున్నాం. ఆర్మీకి గౌరవం తెలియని మీలాంటి వ్యక్తులు ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం బాధాకరం,” అని జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) వ్యాఖ్యానించారు.
విజయ్ షా విడుదల చేసిన క్షమాపణ వీడియోను కోర్టు తిరస్కరించింది. ఆ వీడియోలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని, కేవలం విమర్శల నుంచి తప్పించుకోవడం కోసమే దాన్ని రూపొందించారని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘క్షమాపణ అంటే స్పష్టంగా తప్పును ఒప్పుకుని, నిర్ధారితంగా బాధ్యత తీసుకోవాలి. కానీ మీరు ‘ఒకవేళ’, ‘అదీ ఇదీ’ అంటూ చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇది క్షమాపణే కాదు’’ అని కోర్టు (Supreme Court) పేర్కొంది. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించిన కోర్టు.. మధ్యప్రదేశ్ డీజీపీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐజీ స్థాయి అధికారితో పాటు కనీసం ఒక మహిళా అధికారి ఆ బృందంలో ఉండాలన్న షరతును విధించింది. మే 28వ తేదీలోగా ఈ బృందం తొలి నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టంగా తెలిపింది.