Lok Sabha: వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ (సవరణ) బిల్లు 2025కు లోక్ సభ ఆమోదం తెలిపింది.
సుదీర్గ చర్చలో భాగంగా విపక్ష ఇండియా(India) కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith shah), మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు దీటుగా జవాబిచ్చారు. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్‌సభ భేటీ కొనసాగడం ఇదే ప్రథమంగా చెప్పవచ్చు..
బిల్లుకు ఎన్డీయే ప్రధాన భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీ(యు), శివసేన (షిండే), లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) మద్దతివ్వడంతో బీజేపీలో ఉత్సాహం ఇనుమడించింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. తీవ్ర నిరసనను ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపివేశారు. వైసీపీ కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది. చర్చ, ఆమోదం కోసం వక్ఫ్ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది.
ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని అన్నారు మైనార్టీ మంత్రి రిజిజు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విస్తృత మంతనాలు జరిపి బిల్లులో పలు మార్పులు చేసిందని తెలిపారు. ముస్లింల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విస్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సమర్థంగా, పారదర్శంగా కొనసాగించటానికి యత్నిస్తున్నామని తెలిపారు. ‘‘దేశంలో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత భారీగా ఆస్తులుంది వక్ఫ్ బోర్డుల నియంత్రణలోనే. రైల్వేలు, రక్షణ శాఖ ఆస్తులు దేశానికి చెందుతాయి. స్వభావ రీత్యా వక్ఫ్ ఆస్తులు ప్రైవేటువే. పేద ముస్లింలకు వీటిని ఉపయోగించాలి. నిరుపేదల ఉన్నతి కోసం మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రిజిస్టర్ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు.
ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు వారి హక్కులు దక్కుతాయి’’ అని రిజిజు తెలిపారు. వక్ఫ్ బిల్లు పేరును…యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా (ఉమీద్-యుఎంఈఈడీ)గా వ్యవహరించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు ‘ముసల్మాన్ వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లు-2024’ను కూడా లోక్‌సభలో చర్చ, ఆమోదం కోసం కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం విపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ… ‘ప్రపంచంలో మైనారిటీలకు భారత్ కన్నా సురక్షితమైన దేశం మరొకటి లేద’ని తెలిపారు. తాను కూడా మైనారిటీ వర్గానికి చెందిన వాడినేనని పేర్కొన్నారు. వక్ఫ్ ట్రైబ్యునళ్ల వద్ద చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత అవన్నీ సత్వరమే పరిష్కారమవుతాయని వివరించారు. అనంతరం విపక్ష సభ్యులు పట్టుపట్టడంతో సవరణలపై సభాపతి విడివిడిగా ఓటింగ్ నిర్వహించారు.
చట్టాన్ని అందరూ పాటించాలి: హోంమంత్రి
వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప కీడు చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొడుతున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు తీసుకువస్తోన్న ఈ చట్టాన్ని అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకుని కొందరు రూ.వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ ఉన్నది నిరుపేద ముస్లింల కోసమే కానీ దొంగల కోసం కాదని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా వక్ఫ్ చట్టానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్యాయమైన సవరణలు చేసిందని విమర్శించారు. ఆ మార్పులు చేయకపోతే నేటి బిల్లు అవసరమయ్యేది కాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ 4డి దాడి
వక్ఫ్ బిల్లులోని పలు నిబంధనలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగొయ్ పదునైన విమర్శలతో వాగ్బాణాలు సంధించారు. వక్ఫ్ బిల్లును రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడిగా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని నీరుగార్చడం (డైల్యూట్), మైనారిటీలను అప్రతిష్ఠ పాల్జేయడం (డిఫేమ్), సమాజాన్ని విభజించడం (డివైడ్), ముస్లింల హక్కులను హరించడం(డిసెన్‌ఫ్రాంఛైజ్) అనే నాలుగు (4డి) లక్ష్యాలతోనే బిల్లును తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. ‘‘వక్ఫ్‌కు ఒక ముస్లిం తన ఆస్తిని విరాళంగా ఇవ్వాలంటే కనీసం అయిదేళ్లు ముస్లిం మతాన్ని ఆచరించినట్లు ధ్రువీకరణ సమర్పించాలనే నిబంధన అత్యంత దారుణం. ప్రభుత్వం నుంచి మత ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి రావడం నేడు దేశంలో మైనారిటీల దుస్థితికి నిదర్శనం. మత విశ్వాసాల అంశంలోకి ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది?’’ అని గొగొయ్ ప్రశ్నించారు.
బిల్లుపై రాహుల్ ఆందోళన
వక్ఫ్ బిల్లుపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ- ముస్లింల వైయుక్తిక చట్టాల్లో జోక్యం చేసుకుని, వ్యక్తిగత ఆస్తుల్ని లాక్కోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ముస్లింలు లక్ష్యంగా ఆరెస్సెస్, భాజపా, వాటి మిత్రపక్షాలు చేస్తున్న దాడి ఇక్కడితో ఆగదని, భవిష్యత్తులో ఇతర మతాలవారిపైనా ఇలాగే చేస్తారని ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.