Kamal Hassan: రాజ్యసభకు కమల్ హాసన్..! విజయ్‌కి చెక్ పెట్టేందుకేనా..?

కమల్ హాసన్ (Kamal Hassan) విలక్షణ నటుడిగా సుప్రసిద్ధులు. అయితే రాజకీయాల్లో (Tamilnadu Politics) కూడా ఆయనకు ప్రవేశముంది. 2018లో ఆయన మక్కల్ నీది మయ్యం (MNM) పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తాను పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. గ్రామాల సాధికారతకోసం కృషి చేస్తానని మాటిచ్చారు. అప్పటి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కమల్ హాసన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ వర్కవుట్ కాలేదు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో పరాభవన్నే మూటగట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు అదృష్టం కాస్త కలిసొస్తున్నట్టు కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆయన జూన్ లో ఆయన రాజ్యసభలో (Rajyasabha MP) అడుగుపెట్టే అవకాశం ఉంది.
కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) పేరుతో పార్టీ పెట్టారు. 2019 సాధారణ ఎన్నికల్లో తమిళనాడులోని దాదాపు అన్ని స్థానాల్లో బరిలోకి దిగారు. అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. అయితే ఆయన పార్టీకి దాదాపు 3శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2021 తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో బరిలోకి దిగారు. అయితే ఒక్క సీటును కూడా MNM గెలుచుకోలేకపోయింది. దీంతో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే (DMK), కాంగ్రెస్ (Congress) కూటమితో జతకట్టారు. పొత్తులో బాగంగా కమల్ హాసన్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే కూటమి తరపున ఆయన జోరుగా ప్రచారం చేశారు. ఆ కూటమికి 39 పార్లమెంటు స్థానాలు దక్కాయి.
2024 లోక్ సభ ఎన్నికల్లో (2019 Loksabha Elections) పోటీకి దూరంగా ఉండడం, కూటమి తరపున ప్రచారం చేయడంతో కమల్ హాసన్ ను తగిన విధంగా గౌరవించాలని డీఎంకే, కాంగ్రెస్ భావించాయి. అందులో భాగంగా ఈ ఏడాది జూన్ లో ఖాళీ కానున్న ఆరు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం నుంచి కమల్ హాసన్ ను దింపాలని డీఎంకే నిర్ణయించింది. వాస్తవానికి పొత్తు పెట్టుకునేటప్పుడే కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జూన్ లో రాజ్యసభకు వెళ్లేందుకు కమల్ హాసన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అదే జరిగితే కమల్ హాసన్ తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టినట్లు అవుతుంది.
అయితే కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపించడం వెనుక డీఎంకే రాజకీయ ఎత్తుగడలు ఉన్నట్టు అర్థమవుతోంది. ఇటీవలే సినీ నటుడు విజయ్ (Hero Vijay) రాజకీయ పార్టీ పెట్టారు. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్ల ఆయన పార్టీ బరిలోకి దిగబోతోంది. విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన బరిలోకి దిగితే తమ విజయావకాశాలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని డీఎంకే అంచనా వేస్తోంది. అందుకే కమల్ హాసన్ లాంటి నటుడ్ని దూరం చేసుకోవడం డీఎంకేకు ఇష్టంలేదు. విజయ్ ని కమల్ హాసన్ ద్వారా ఎదుర్కోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.