Kamal Haasan: హిందీని రుద్దొద్దు.. విద్యకు అవరోధంగా మారుతుంది: కమల్ హాసన్

స్టార్ యాక్టర్, తమిళనాడు రాజకీయ నేత కమల్ హాసన్ (Kamal Haasan) త్రిభాషా విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. “తమిళనాడు మాత్రమే కాదు, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలూ ఈ విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయి. భాష అనేది ప్రేమతో నేర్చుకోవాలి, ఒత్తిడితో కాదు. అవసరమైతే ప్రజలు నేర్చుకుంటారు, కానీ బలవంతంగా బోధించవద్దు. ఇది విద్యకు అడ్డుకట్టు అవుతుంది. విద్య అంటే సులభమైన మార్గంలో సారవంతమైన విజ్ఞానాన్ని అందించడమే. మళ్లీ కొత్త భాషను తప్పనిసరి చేస్తే, అది విద్యార్థులకు అవరోధంగా మారుతుంది” అని కమల్ (Kamal Haasan) చెప్పారు.
ఇంగ్లీషు భాషను కొనసాగించడంలోనే ప్రయోజనం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “మనకు ఇప్పటికే ఇంగ్లీష్ మీద 350 సంవత్సరాల అనుభవం ఉంది. ఇది ఒక్కసారిగా మార్చడమంటే మళ్లీ మొదటి నుంచి అంతా మొదలుపెట్టడమే. దీంతో విద్యపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎంతోమంది నిరక్షరాస్యులుగా మారతారు. ముఖ్యంగా తమిళనాడులో వంటి రాష్ట్రాలపై ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది” అని ఆయన (Kamal Haasan) వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం కూడా జాతీయ విద్యా విధానంలోని (NEP) త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా నిలుస్తూ వస్తోంది. డీఎంకే ప్రభుత్వం ఈ విధానాన్ని కేంద్రం దక్షిణాదిపై హిందీని రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నంగా చూస్తోంది.