SHAR: మరో మైలురాయి దిశగా ఇస్రో అంతరిక్ష సంస్థ

అంతరిక్షరంగంలో అప్రతిహతంగా దూసుకెళ్తున్న ఇస్రో(ISRO).. ఇప్పుడు మరో మైలురాయికి చేరువైంది.శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి తన వందో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి తన 100వ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. స్వదేశీ క్రయోజెనిక్ స్టేజ్‌తో కూడిన GSLV-F15 రాకెట్‌తో NVS-02 మిషన్‌కు అంతరిక్ష సంస్థ సన్నాహాలు చేస్తోంది. NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ కక్ష్యలోకి పంపేందుకు ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.
2025 జనవరి 29వ తారీఖున ఉదయం 6గంటల 23 నిమిషాలకు GSLV. ఎఫ్15 రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన NVS-02 ఉపగ్రహాన్ని 36,000 వేల కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న నిర్దేశిత కక్ష లోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు షార్ కేంద్రంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.ఈ ప్రయోగం ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగంగా గుర్తింపు పొందడంతో, షార్‌లో వివిధ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే జిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ పరంపరలో ఈ ప్రయోగం 17వది.
ఈ ప్రాజెక్టులో ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మూడు రోజుల పరిశోధనల అనంతరం సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తారు. అయితే, ఈ ప్రయోగాలన్నింటికీ స్పేడెక్స్ మిషన్ కీలక సాంకేతికతను అందించింది. 2024 డిసెంబర్ 30 న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి60 రాకెట్ ప్రయోగం ద్వారా 99 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో, 2025 జనవరి 29వ తారీఖున 100వ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
భారత్ అంతరిక్ష ప్రయోగాల కోసం తొలుత అమెరికా, రష్యా దేశాలపై ఆధారపడి అక్కడ తయారుచేసిన ఉపగ్రహాలను 1960 – 1970 మధ్య కర్ణాటకలోని తుంబ రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించేవారు. ఆ తర్వాత 1979లో శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగాలను మొదలుపెట్టిన తొలి ప్రయోగం విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్దుకుని 1980లో ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో ఆ తర్వాత వెనక్కు చూడలేదు. ఒక్కొక్క అడుగు విజయం సాధిస్తూ నేడు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా కీలక ప్రయోగాలను చేపడుతోంది.