Arvind Kejriwal: అరవింద్ కేజ్రివాల్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారా..?

ఆమ్ ఆద్మీ పార్టీని (AAP) అనతికాలంలోనే జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కచ్చితంగా అరవింద్ కేజ్రివాల్ (Aravind Kejriwal) దే.! కేజ్రివాల్ వరుసగా రెండు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించారు. అయితే తాజా ఎన్నికల్లో (Delhi Elections) అరవింద్ కేజ్రివాల్ ఓడిపోయారు. తన పార్టీ ఓడిపోవడమే కాకుండా న్యూఢిల్లీ (New Delhi) స్థానం నుంచి బరిలోకి దిగిన కేజ్రివాల్ కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన పార్టీ కష్టకాలంలో ఉంది. అధినేతే యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటే పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందనే భయాందోళనలు నెలకొంటున్నాయి. అందుకే అరవింద్ కేజ్రివాల్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు పావులు కదుపుతున్నారనే టాక్ నడుస్తోంది.
అవినీతికి వ్యతిరేకంగా పుట్టినపార్టీ ఆప్. ఇదే నినాదంతో ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చరిత్ర సృష్టించింది. 2015, 2020 ఎన్నికల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తనదైన సంక్షేమ కార్యక్రమాలతో ఢిల్లీ ప్రజల మనసులను గెలుచుకున్నారు. అయితే రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యాక అరవింద్ కేజ్రివాల్ కు అవినీతి మరక అంటింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) ఆయన అరెస్టయి జైలుకు వెళ్లారు. ఈ కేసులోనే ఆయన ముఖ్యమంత్రి పీఠం వదులుకోవాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో ఇది ప్రధాన అజెండాగా మారింది. అరవింద్ కేజ్రివాల్ అవినీతిని ఢిల్లీ ప్రజలు సహించలేదు. ఆయనతో పాటు పార్టీని కూడా అధికారానికి దూరం చేశారు.
అరవింద్ కేజ్రివాల్ ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. పార్టని కాపాడుకోవడం కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో ఏకనాథ్ షిండేలా మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అదే జరిగితే పంజాబ్ లో కూడా ఆప్ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఢిల్లీ ఓటమితో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కేజ్రివాల్ కు పంజాబ్ లో పార్టీని కాపాడుకోవడం, అధికారాన్ని రక్షించుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు కేజ్రివాల్ తనదైన ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో ఎలాగూ అధికారం పోయింది. పంజాబ్ (Punjab) లో అధికారాన్ని కాపాడుకోవాలంటే తానే ముఖ్యమంత్రి అవడం బెటర్ అనే ఆలోచనలో కేజ్రివాల్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే త్వరలో జరగబోయే లూథియానా అసెంబ్లీ బైపోల్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ద్వారా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని కేజ్రివాల్ భావిస్తున్నట్టు సమాచారం. పంజాబ్ లో ఎమ్మెల్యేలలను చీల్చడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి చెక్ పెట్టాలంటే తాను ముఖ్యమంత్రి కావడమే ఏకైక మార్గం అని కేజ్రివాల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీ వదిలేసి పంజాబ్ వెళ్తే అధికారం లేకుండా కేజ్రివాల్ ఉండలేకపోతున్నారనే విమర్శలు వస్తాయి. మరి ఆయన ఏం చేస్తారనేది వేచి చూడాలి.