ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గట్టి హెచ్చరిక ..ఒకేసారి రెండు
దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గట్ట హెచ్చరిక జారీ చేసింది. తమ దగ్గర ఉద్యోగం చేస్తూనే మరో సంస్థకు కూడా విధులు నిర్వర్తించడం కుదరదని స్పష్టం చేసింది. ఇది నియామక నిబందనల ఉల్లంఘన కిందకు వస్తుంది కనుక క్రమశిక్షణ చర్యలు తప్పవని, ఇది తొలగింపునకూ దారిదీస్తుందని హెచ్చరించింది. ఐటీ కంపెనీల నిర్వాహకులను మూన్‌లైటింగ్ (ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం) కలవర పెడుతున్న సంగతి విదితమే. కొందరు ఈ విధానాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్ మాత్రం ఈ విషయంలో స్పష్టమైన వైఖరిని ఇ మెయిల్ ద్వారా తన ఉద్యోగులకు తెలియ చేసింది.
ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం నియామక ఒప్పంద నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిని తాము అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామక సమయంలో ఇచ్చిన ఆఫర్ లెటర్లో ఈ విషయం ఉందనే విషయాన్ని ఇన్ఫోసిస్ గుర్తు చేసింది. సాధారణ పని వేళలు, ఆ తర్వాతి వేళల్లో కూడా రెండో ఉద్యోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ తాము అనుమతించమని ఇన్ఫోసిస్ తెలిపింది. రెండు ఉద్యోగాలు చేస్తే, ఎదుర్కోవాల్సిన పరిణామాలను తమ బృంద సభ్యులకు తెలియజేయాల్సిందిగా మేనేజర్లకు కంపెనీ సూచించింది. మూన్‌లైటింగ్ వ్యవహారం మీ దృష్టికి వస్తే తక్షణమే సంబంధిత యూనిట్ హెచ్ఆర్కు తెలియజేయాలని ఆదేశించింది.






