Indigo: విమానంలో 168 మంది.. పైలెట్ ల మేడే కాల్, అసలేం జరిగింది..?

అహ్మదాబాద్ విమాన(Flight crash) ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం అనగానే ప్రయాణికుల్లో తెలియని ఆందోళన కనపడుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం.. మేడే అనే హెచ్చరిక సిగ్నల్.. వింటేనే విమాన ప్రయాణికులకు చెమటలు పడుతున్నాయి. తాజాగా మరోసారి ఈ కాల్ వినపడింది. అది కూడా వేరే ఏ దేశంలో కాదు.. మన దేశంలోనే, దేశీయ విమానంలో మేడే కాల్ వినపడింది. విమానంలో ఇంధనం అయిపోవడంతో ఓ పైలెట్ మేడే కాల్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
168 మంది ప్రయాణికులతో బయలుదేరిన బడ్జెట్ క్యారియర్ ఇండిగో.. గౌహతి-చెన్నై(Chennai) విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయిందని విమానయాన వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటన గురువారం జరిగిందని.. ఇద్దరు పైలెట్ లను ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలిపాయి. మేడే కాల్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఇంధనం తక్కువగా ఉండటమే. అయినా సరే ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇండిగో విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయింది.
మేడే కాల్ అందిన తర్వాత, ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఆన్-గ్రౌండ్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. వారు వెంటనే చర్యలకు దిగారు. వైద్య, అగ్నిమాపక సేవల సిబ్బంది అక్కడకి చేరుకొని ఏ విధమైన పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్దమయ్యారు. విమానం రాత్రి 8:20 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వర్గాలు తెలిపాయి. ఇక మరో విమానంలో కూడా సాంకేతిక సమస్యలు కంగారు పెట్టాయి. శుక్రవారం, మధురై వెళ్తున్న ఇండిగో విమానం గాలిలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నైలో ల్యాండ్ అయింది. దాదాపు 68 మంది ప్రయాణికులతో కూడిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దింపారు.