Cable Bridge: దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్..

దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ ఝార్ఖండ్‌లోని రాంచీ (Ranchi) లో అందుబాటులోకి వచ్చింది. సిరంటోలీ ఏరియా నుంచి భారత ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ వరకు ఫ్లైఓవర్‌ను నిర్మించారు. అందుకే దీన్ని సిరంటోలీ – మెకాన్ ఫ్లైఓవర్ అని పిలుస్తున్నారు. ఈ వంతెనకు ప్రముఖ గిరిజన నాయకుడు కార్తీక్ ఒరాన్ పేరు పెట్టారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemanth Soren) ఈ నెల 5న దీనిని ప్రారంభించారు.
డబుల్ డెక్కర్ వ్యూ!
సిరంటోలీ – మెకాన్ ఫ్లైఓవర్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. రాంచీ పరిధిలోని రైల్వేలైన్‌పై 132 మీటర్లు పొడవునా కేబుల్స్‌ను దన్నుగా చేసుకొని నిలిచేలా ఈ వంతెనను నిర్మించారు. ఈ కేబుల్స్ ఫ్లైఓవర్ రెండో సెక్షన్ 94 మీటర్ల విస్తీర్ణంలో ఉంది. అది రాంచీలోని హర్ము నది – పాత ఓవర్ బ్రిడ్జి ఏరియాల మీదుగా వెళ్తుంది. సిరంటోలీ – మెకాన్ రైల్వే ఫ్లై ఓవర్ రెండో సెక్షన్ మీదుగా వెళ్లేటప్పుడు పరిసర ప్రాంతాలను చూస్తే ప్రయాణికులకు డబుల్ డెక్కర్ రైలు లేదా బస్సులో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి నుంచి ఆ విధంగా పరిసర ప్రాంతాలు కనిపిస్తాయి. ఫ్లైఓవర్ మొత్తంగా 2.34 కి.మీ. పొడవునా విస్తరించి ఉంటుంది. రాంచీలోని సిరంటోలీ ఏరియా వద్ద నుంచి రైల్వే లైన్, బ్రిడ్జి మీదుగా ఇది వెళ్తుంది. బ్రిడ్జిని దాటాక రాంచీలోని రాజేంద్ర చౌక్ – గోలంబర్ (దొరంద) వద్ద ఈ ఫ్లై ఓవర్ రెండు వేర్వేరు రోడ్లుగా విడిపోతుంది.. ఒక రోడ్డు నగరంలోని నేపాల్ హౌస్ వరకు వెళ్తుంది. మరో రోడ్డు రాంచీలోని దొరంద పోస్టాఫీస్, అటవీశాఖ కార్యాలయాలను అనుసంధానం చేస్తుంది.
Chattis garh: సిరంటోలీ – మెకాన్ రైల్వే ఫ్లై ఓవర్ స్పెషల్..!
ఈ రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు హేమంత్ సోరెన్ 2022 ఆగస్టు 19న శంకుస్థాపన చేశారు. రూ.372 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు.2 సంవత్సరాల 9 నెలల 16 రోజుల్లో వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
ఫ్లై ఓవర్ పనుల కోసం నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మలేసియా నుంచి కేబుల్స్‌ను కొనుగోలు చేసింది.
ప్రతీ కేబుల్ 45 నుంచి 54 వైర్లను కలిగి ఉంటుంది. ఈ కేబుల్స్ వంతెన నిలిచేందుకు బలాన్ని అందిస్తాయి.వంతెన డిజైన్‌కు సంబంధించి ఐఐటీ ముంబై నిపుణులు, జార్ఖండ్ రోడ్డు నిర్మాణ విభాగం నిపుణుల నుంచి సలహాలను తీసుకున్నారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో 42 మోనోపైల్స్ (భారీ స్తంభాలు)తో పాటు 72 కేబుల్స్‌ను వినియోగించారు.
ఈ వంతెన చుట్టూ ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలకు వాహనాల శబ్దం చేరకుండా ఉండటానికి ఫ్లైఓవర్ రెయిలింగ్‌పై 1.6 మీటర్ల ఎత్తున సౌండ్‌ప్రూఫ్ క్రాష్ బారియర్‌ను ఏర్పాటు చేశారు.
అందంగా కనిపించేలా చేయడానికి ఈ కేబుల్ ఫ్లైఓవర్‌పై ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేశారు. అవి ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి జాతీయ జెండా రంగులను విరజిమ్ముతాయి.ఈ వంతెనపై ప్రతి 30 మీటర్లకు డబుల్-ఆర్మ్ లైట్లు ఏర్పాటు చేశారు.