Indian Railway: చార్ట్ ప్రిపరేషన్ పై ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం

చార్ట్ ప్రిపరేషన్.. రైలు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తలనొప్పిగా మారే అంశం. ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు లో ఉన్న వాళ్లకు ఇది ఖచ్చితంగా సవాల్ అనే చెప్పాలి. టికెట్ బుక్ అయిందా లేదా అనే క్లారిటీ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ఇండియన్ రైల్వేస్(Indian Railway) సిద్దమవుతోంది. ఫైనల్ చార్ట్ ను ప్రిపేర్ చేసి.. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందుగానే రిలీజ్ చేయాలని భావిస్తోంది.
సీట్ బుక్ అయిందా లేదా.. వెయిటింగ్ లిస్టు(Waiting list) లో ఉందా అనే అంశాన్ని ఈ చార్ట్ ఫైనల్ చేస్తుంది. ఇప్పటి వరకు కేవలం 4 గంటల ముందుగానే ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. దీనితో ప్రయాణికుల భవిష్యత్తు ప్రణాళికపై దీని ప్రభావం పడుతోంది. టికెట్ బుక్ కాలేదంటే ఏం చేయాలనేది ప్రయాణికులకు క్లారిటీ ఉండని పరిస్థితి నెలకొంది. దీనితో 24 గంటల ముందుగానే చార్ట్ ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తే.. వారికి సరైన అవకాశం దొరుకుతోంది. ఇండియన్ రైల్వే ప్రస్తుతం ఉన్న సిస్టం ప్రకారం.. రెండు చార్టులను ప్రిపేర్ చేస్తోంది.
మొదటి చార్ట్ ను.. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రిలీజ్ చేస్తున్నారు. ఇక రెండవ చార్ట్ మాత్రం 30 నిమిషాల ముందు రిలీజ్ చేస్తున్నారు. రాబోతున్న కొత్త వ్యవస్థ ఈ రెండు-దశల ప్రక్రియను రద్దు చేయనుంది. 24 గంటల ముందుగానే తుది చార్ట్ ను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఇండియన్ రైల్వేస్ పని చేస్తోంది. టెక్నాలజీని మరింత అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తున్న భారత రైల్వే.. ఈ వ్యవస్థను కీలకంగా భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.