Piyush Goyal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్యలు: పీయూష్ గోయల్

ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనపై అగ్రరాజ్యానికి, భారత్‌కు మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) పేర్కొన్నారు. ఈ ఒప్పందం విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చర్చల్లో పాల్గొన్న సమయంలోనూ మాట్లాడుకున్నారన్నారు. వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయన్నారు. ఈ సమస్యను ఇరుదేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయని వెల్లడిరచారు. ఇరుదేశాల మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్ (India)ను సందర్శించనుందని గోయల్ తెలిపారు. జూన్ చివరికి ఇరుదేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ (Rajesh Agarwal) గత నెలలో వాషింగ్టన్‌లో అధికారులతో ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలు జరిపారని తెలిపారు.