India-Pakistan: భారత్-పాకిస్తాన్ మధ్య ‘అణుయుద్ధం’ సూచనలు కనిపించలేదు: విక్రమ్ మిస్రీ

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల (India-Pakistan Tensions) సమయంలో ఎలాంటి అణుయుద్ధ సూచనలు కనిపించలేదని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అనంతరం భారత విదేశాంగ విధానంపై సమీక్షించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మిస్రీ (Vikram Misri) ఈ విషయాలను వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు (India-Pakistan Tensions) సంప్రదాయ పోరాటాలకే పరిమితమై ఉన్నాయని, ఎక్కడా అణ్వాయుధాల వాడకం ముప్పు తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణుబాంబులు వినియోగించే సూచనలు కనిపించలేదని పేర్కొన్నారు. మే 10న భారత్-పాక్ డీజీఎంవోల మధ్య జరిగిన చర్చలే కాల్పుల విరమణ ఒప్పందానికి దారితీశాయని, ఇందులో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని కూడా ఆయన వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను ప్రకటించడంపై కమిటీ సభ్యులు ప్రశ్నించగా మిస్రీ ఈ వివరణ ఇచ్చారు.
అలాగే భారత్‌పై దాడుల కోసం చైనా ఆయుధాలు పాకిస్తాన్ వినియోగించిందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ – భారత వాయుసేన పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై సమర్థవంతంగా దాడి చేసిందని గుర్తుచేశారు. “అప్పుడు వారు ఏ దేశం ఆయుధాలు వాడారనే ప్రశ్నకు అర్థం లేదు. భారత దళాలు తమ మిషన్‌ను విజయవంతంగా ముగించాయి” అని మిస్రీ (Vikram Misri) వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అధ్యక్షత వహించగా.. సభ్యులుగా అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), రాజీవ్ శుక్లా, దీపేందర్ హుడా (కాంగ్రెస్), అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం), అపరాజిత సారంగి (బీజేపీ), అరుణ్ గోవిల్ (బీజేపీ) తదితరులు హాజరయ్యారు.