Kashmir: కశ్మీర్‌పై పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత్

కశ్మీర్ (Kashmir) గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఘాటుగా బదులిచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని విడిచిపెట్టడమే కశ్మీర్‌తో పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక సంబంధమని తేల్చి చెప్పింది. “ఒక విదేశీ భూభాగం మీ జీవనాడి ఎలా అవుతుంది? కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగం” అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. “కశ్మీర్ (Kashmir) విషయంలో మా విధానం స్పష్టంగా ఉంది. ఆ ప్రాంతం మా జీవనాడి లాంటిది. దానిని మేము ఎప్పటికీ విడిచిపెట్టం” అని అన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. కశ్మీర్ విషయంలో భారతదేశం తన వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎప్పటికప్పుడు బలంగా వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.
గతంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ (Kashmir) లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని స్పష్టం చేశారు. పొరుగు దేశం అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. పీఓకే పాకిస్థాన్‌కు ఒక విదేశీ భూభాగం మాత్రమే అవుతుందని, అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా కూడా భారత్ ఇదే విషయాన్ని గట్టిగా చెప్పింది. ఐరాసలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై జరిగిన చర్చల్లో జమ్మూ కాశ్మీర్‌ను అనవసరంగా ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత ప్రతినిధి గట్టిగా బుద్ధి చెప్పారు.
“భారత కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్‌పై (Kashmir) పాకిస్థాన్ ప్రతినిధి మరోసారి అర్థంలేని వ్యాఖ్యలు చేశారు. ఇలా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా వారి చట్టవిరుద్ధమైన వాదనలు నిజం కావు. ఇటువంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే. ఆ ప్రాంతంలోని కొంత భూభాగం ఇంకా పాకిస్థాన్ ఆక్రమణలో ఉంది. దానిని వారు ఖాళీ చేయాల్సిందే” అని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ సూటిగా చెప్పారు.